పటమటలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
మొదటి గంటలో ముగ్గురికి…
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్ కొనుగోలు దారుడికి ఇచ్చేలా పైలట్ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్‌శాఖ శ్రీకారం చుట్టింది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ప్రాజెక్టును సోమవారం అధికారులు ప్రారంభించారు. పాత విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలంటే రోజుల కొద్దీ సమయం పట్టేది. వివిధ ప్రాంతాల నుంచి క్రయ, విక్రయదారులు ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి పడిగాపులు కాయడం ఆనవాయితీగా ఉండేది. దీనివల్ల సమయంతోపాటు అదనంగా ఆర్థిక ఖర్చులు తడిచిమోపెడయ్యేవి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంతో క్రయ, విక్రయ దారులు ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు 45 నిముషాల నుంచి గంట వరకు సమయం పడుతోంది. ఆ సమయాన్ని తగ్గించేందుకుగాను స్లాట్ విధానంలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని ఆధారంగా క్రయ, విక్రయ దారులు కోరుకున్న సమయంలో నిర్దేశించిన తేదీన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. పటమట రిజిస్ట్రార్ కార్యాలయంలో పది నిమిషాల్లో మూడు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసి మొదటి గంటలోనే ముగ్గురికి అందజేశారు. ఈ రిజిస్ట్రార్‌లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును రిజిస్ట్రార్‌శాఖ అమలు చేయనుంది. డాక్యుమెంట్ల స్కాన్ కాపీని వాట్షాప్ ద్వారాను కస్టమర్లకు అధికారులు అందజేస్తారు. పది నిముషాల్లో పని పూర్తవ్వడంతో కస్టమర్లకు కాస్త వెలుసుబాటు వస్తోంది.


