రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. అంతేకాకుండా, హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది. భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావుపై 2021 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు 2022లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులోనే ఏబీ వెంకటేశ్వరరావును గత వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నాటి ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ ఏబీవీ న్యాయపోరాటం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన నాటి ప్రభుత్వం, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అడిషనల్ డీజీగా బాధ్యతలు అప్పగించింది. అయితే బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే మరలా సస్పెండ్ చేయడంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాట్ రద్దు చేయడంతో నాటి ప్రభుత్వం ఆయన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన మరలా ప్రింటింగ్ అండ్ స్పేషనరీ విభాగం అడిషనల్ డీజీగా బాధ్యతలు చేపట్టి అదే రోజు పదవీ విరమణ పొందారు.
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
RELATED ARTICLES