రోహింగ్యాల అక్రమ వలసలు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడమే కాకుండా, దేశ అంతర్గత భద్రతకు కూడా పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ప్రభుత్వ యంత్రాంగంలోని వ్యక్తుల సహకారంతోనే రోహింగ్యాలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, వారికి సులభంగా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు కూడా అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ ఇవాళ జాతీయ మీడియాతో మాట్లాడారు. గతంలో, ముఖ్యంగా 2017-18 సంవత్సరాల మధ్యకాలంలో, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు బంగారం పని నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వలస వచ్చారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. మయన్మార్‌కు చెందిన ఈ రోహింగ్యాల వలసల వల్ల స్థానిక యువత తీవ్రంగా నష్టపోతోందని, వారికి దక్కాల్సిన ఉద్యోగావకాశాలు చేజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్నది ఎప్పటినుంచో ఉన్న ప్రధాన డిమాండ్. తెలంగాణ ఉద్యమంలోనూ ఇది కీలక నినాదం. కానీ, దేశ సరిహద్దులు దాటి వచ్చిన రోహింగ్యాలు ఇక్కడే తిష్టవేసి, మన యువత ఉపాధిని దెబ్బతీస్తున్నారు. అని పవన్ పేర్కొన్నారు. వారికి మన దేశంలో స్థిరపడేందుకు అవసరమైన గుర్తింపు కార్డులు ఎలా లభిస్తున్నాయన్న దానిపై ఆయన తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. మన వ్యవస్థలోని కొందరు వ్యక్తులు వారికి సహకరించడం వల్లే ఇది సాధ్యమవుతోంది. దీనిపై లోతైన విచారణ జరగాలి. రోహింగ్యాలు మన పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై ప్రజల్లో చైతన్యం రావాలి,ఁ అని ఆయన అన్నారు. ఈ వలసల వల్ల కేవలం నిరుద్యోగమే కాకుండా, అంతర్గత భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహకరిస్తున్న యంత్రాంగంపై కఠిన నిఘా ఉంచాలని, అంతర్గత భద్రత విషయంలో మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తాను పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాసినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి, తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు పెనుముప్పు: పవన్
RELATED ARTICLES