Homeఆంధ్రప్రదేశ్పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు డీపీఆర్‌ తయారీకి రూ.14.37 కోట్లు

పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు డీపీఆర్‌ తయారీకి రూ.14.37 కోట్లు

- Advertisement -

పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు నీటిని మళ్లించే అనుసంధాన పనుల కోసం డీపీఆర్‌ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) తయారీ, సాంకేతిక అంశాల పరిశీలన, సర్వేలు తదితర కార్యక్రమాలకు మొత్తం రూ.14.37 కోట్లు ఖర్చు చేయాలన్న జలవనరులశాఖ గత నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి ర్యాటిఫికేషన్‌ ఇచ్చారు.

మొదట పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం కోసం డీపీఆర్‌ తయారీకి కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజినీర్‌ ఆదేశాల మేరకు టెండర్లు పిలిచారు.అయితే అనంతరం ఈ ప్రాజెక్టును బనకచర్ల వరకు కాకుండా పోలవరం నుంచి నల్లమలసాగర్‌ వరకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు.
మొదటి ప్రణాళిక ప్రకారం పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజి వరకు, అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయం వరకు నీటిని తీసుకెళ్లే విధానం కొనసాగుతుంది.మూడో దశలో బనకచర్లకు కాకుండా నల్లమలసాగర్‌ జలాశయం వరకు మళ్లింపుకే పరిమితం చేయడంతో, ఆ మేరకు డీపీఆర్‌ తయారీకి టెండర్లను సవరించి మళ్లీ ఆహ్వానించారు.

గోదావరి-పెన్నా తొలి దశ పనుల్లో భాగంగా మొదటి ప్యాకేజీకి కేటాయించిన నిధుల నుంచే పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధానానికి రూ.14.37 కోట్లు ఖర్చు చేయాలని గతంలోనే ఈఎన్‌సీ నిధులు మంజూరు చేశారు.ఆ నిర్ణయానికే ఇప్పుడు మంత్రివర్గం అధికారిక ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అధ్యయనాలు చేసి డీపీఆర్‌ను రూపొందించనున్నారు.కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు కావాల్సిన సర్వేలు కూడా నిర్వహించనున్నారు. ఈ పనుల కోసం రూ.9.20 కోట్లు కేటాయించారు.

అటవీ ప్రాంతాల్లో ఎంత మేరకు ముంపు ఏర్పడుతుందో నిర్ధారించేందుకు డీజీపీఎస్‌ సర్వే చేయనున్నారు.
అలాగే ముంపుకు బదులుగా ఎక్కడ అటవీ అభివృద్ధి చేయవచ్చో గుర్తించి నివేదిక ఇవ్వడానికి రూ.1.28 కోట్లు కేటాయించారు.ప్రతిపాదిత బొల్లాపల్లి జలాశయం కారణంగా ముంపులోకి వచ్చే గ్రామాలు, పునరావాస అనుమతుల కోసం అవసరమైన వివరాల సేకరణ, సాంఘిక-ఆర్థిక సర్వేలు నిర్వహించి సమగ్ర పునరావాస ప్రణాళిక రూపొందించేందుకు రూ.0.49 కోట్లు మంజూరు చేశారు.పర్యావరణ ప్రభావ అంచనా సర్వేలు సహా ఇతర అంశాలకు రూ.3.50 కోట్లు కేటాయించారు.

రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల కింద మొత్తం రూ.344.39 కోట్ల అంచనా వ్యయంతో 7,189 నిర్వహణ పనులు చేపట్టేందుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.జలవనరులశాఖ ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది.
మొదట ఇదే నిధులతో 7,174 పనులు చేపట్టాలని నిర్ణయించగా, అనంతరం అదే మొత్తంతో పనుల సంఖ్యను 7,189కి పెంచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు