Homeజాతీయంరికార్డు స్థాయిలో రూపాయి పతనం!

రికార్డు స్థాయిలో రూపాయి పతనం!

- Advertisement -

డాలర్‌తో పోలిస్తే దాదాపు రూ.92కు..
అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో భారత జీవితకాల కనిష్ఠానికి రూపాయి ఒత్తిడికి లోనవుతోంది. తాజా ట్రేడింగ్ సెషన్‌లో తొలిసారి 92 స్థాయిని తాకి, డాలరుతో పోలిస్తే ఇప్పటివరకు లేనంత తక్కువ విలువకు పడిపోయింది. మార్కెట్‌లో రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 శాతం మేర పతనమైంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ చూస్తే ఏకంగా 5 శాతం మేర రూపాయి విలువ తగ్గింది. దేశఆర్థికాభివృద్ధి అంచనాలకు మించుతున్నా రూపాయి విలువ పతనం కావడం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారత దేశ జీడీపీ 8.2 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. అయితే, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 92 మార్కు కీలక నిరోధం కావడంతో ఈ స్థాయికి మించి పడిపోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, రూపాయి విలువను నిర్దిష్ట స్థితికి పరిమితం చేయాలనే టార్గెట్స్ ఏవీ లేవని ఆర్బీఐ గతంలోనే ప్రకటించింది.

కారణాలు

రూపాయి పతనానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా విధించిన అధిక సుంకాలు, స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ నిధులు తరలిపోవడం, భారీ స్థాయిలో బంగారం దిగుమతులు, కరెన్సీ మరింత పతనం అవుతుందన్న భయాలు వెరసి రూపాయి క్షీణతకు దారి తీస్తున్నాయి. ఇటీవలే ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదిరినా సానుకూల సెంటీమెంట్ బలపడకపోవడం కొసమెరుపు. అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి భారత కరెన్సీ 7.5 శాతం మేర క్షీణించింది. చైనా కరెన్సీ యువాన్‌తో పోలిస్తే రూపాయి విలువ 7.5 శాతం మేర పతనమైంది. అమెరికా సుంకాల తగ్గుదలలో జాప్యం కారణంగా రూపాయి విలువపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అధికారులు చెబుతున్నారు. రాబోయే 12 నెలల్లో డాలర్‌లో పోలిస్తే రూపాయి మారకం విలువ 94కు కూడా పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు