ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌కు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో చేపట్టిన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశిస్తూ స్టాప్-వర్క్ నోటీసు జారీ చేసింది. నివాస ప్రాపర్టీని వాణిజ్య అవసరాల కోసం మార్పులు చేస్తుండటమే ఈ నోటీసుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జుహులోని జేవీపీడీ స్కీమ్‌లో ఉన్న కాపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అజయ్ దేవ్‌గణ్‌కు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో ఆయన ఒక అత్యాధునిక సెలూన్, స్పాను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. అయితే, నివాస ప్రాపర్టీలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై సొసైటీ నివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలూన్, స్పా ఏర్పాటు చేస్తే బయటి వారి రాకపోకలు పెరిగిపోతాయని, దీనివల్ల పార్కింగ్, భద్రత, శబ్దం వంటి సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి అంతర్గత రోడ్లు చాలా ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతాయని పేర్కొంటూ బీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన బీఎంసీ కె-వెస్ట్ వార్డు అధికారులు, అజయ్ దేవ్‌గణ్ బంగ్లాను సందర్శించి తనిఖీలు చేపట్టారు. వాణిజ్య కార్యకలాపాల కోసం పొందిన అనుమతులకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ప్రాపర్టీ యజమానులను కోరారు. అయితే, అవసరమైన పత్రాలను వారు అందించడంలో విఫలమవడంతో పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ బీఎంసీ అధికారులు స్టాప్-వర్క్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించేందుకు, అవసరమైన వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువు కావాలని దేవ్‌గణ్ కుటుంబం అధికారులను కోరినట్లు సమాచారం. స్థానిక కార్పొరేటర్ సుధా సింగ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బీఎంసీ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ జరిపిన ప్రాథమిక తనిఖీల్లో ఆ ప్రాంగణానికి ఎలాంటి వాణిజ్య వినియోగ అనుమతులు లేవని తేలిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం బీఎంసీ ఆదేశాలతో బంగ్లాలో పనులు నిలిచిపోయాయి. దేవ్‌గణ్ కుటుంబం ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.


