నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ, ఆ మృతదేహాలను వెలికితీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మృతదేహాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, టన్నెల్ బోరింగ్ మెషీన్ భాగాలు అడ్డుగా ఉండడంతో, మృతదేహాలను బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. ఇప్పటివరకు గురుప్రీత్ సింగ్ అనే మెషీన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. నిన్న మరో రెండు మృతదేహాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో, అడ్డుగా ఉన్న మెషీన్ భాగాలను రెస్క్యూ టీమ్ సిబ్బంది గ్యాస్ కట్టర్లతో తొలగిస్తున్నారు. సహాయక చర్యలు నేటికి 18వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రత్యేకంగా రోబోలను కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. టన్నెల్ లో మరింత ముందుకుపోయేకొద్దీ సహాయక చర్యల సిబ్బంది ప్రాణాలకు కూడా ముప్పు ఉండడంతో రోబోలను తీసుకువచ్చారు.