Homeజిల్లాలుఅనంతపురంపేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలి

పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలి

- Advertisement -

వ్యవసాయ కార్మిక సంఘం

విశాలాంధ్ర – నార్పల : సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించడంతో పాటు పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండల కేంద్రంలోని తహసీల్దార్ అరుణకుమారికి సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పేదల వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రచార యాత్రలు నిర్వహించినట్లు తెలిపారు. పేదలకు సంక్షేమం, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహార భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గ్రామీణ పేదలు ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను దెబ్బతీసే విధంగా కొత్త చట్టాలను తీసుకురావడం సరికాదన్నారు. ఉపాధి హామీ పనుల్లో ముఖ, ఐరిస్ ఆధారిత హాజరు విధానంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పని చేసిన కూలీలకు సకాలంలో కూలి చెల్లింపులు జరగడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలన్నారు. భూ సమస్యలను పరిష్కరించి, 22-ఎలో ఉన్న పేదల భూములకు ఒరిజినల్ అడంగల్, 1బీ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు సాగు భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు :
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పేదలు, వ్యవసాయ కూలీలకు తక్షణమే ఉపాధి హామీ పనులు ప్రారంభించి వలసలను అరికట్టాలి.
కరువు పరిస్థితుల నుంచి వ్యవసాయ కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు నెలకు రూ.10 వేల కరువు భృతి అందించడంతో పాటు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలి.
పేద విద్యార్థుల ఫీజులను రద్దు చేసి విద్యకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలి.
రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించి పేదలకు ప్రభుత్వ భూములను సాగు కోసం పంపిణీ చేయాలి. 22-ఎలో ఉన్న భూములకు ఒరిజినల్ అడంగల్, 1బీ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
కొత్తగా తీసుకొచ్చిన వీఎన్‌జీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి.
అటవీ హక్కుల సంరక్షణ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ఆదివాసీలు, గిరిజనులకు న్యాయం చేయాలి.
పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించి ఆర్థిక, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
ఈ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సహాయ కార్యదర్శులు చాపల రామాంజి, సాకే సుధాకర్, నాగరాజు, నారాయణప్ప, సంజీవరాయుడు, కుళ్లాయప్ప, పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు