– కృష్ణ నామస్మరణతో మార్మోగిన పాఠశాల
– రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారుల సందడి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక రేయిన్బో ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నెమలిపింఛం, వేణువు, సంప్రదాయ దుస్తులతో కృష్ణుడి వేషధారణలో చిన్నారులు అలరించగా, రాధాకృష్ణుల వేషధారణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఆటపాటలు, కృష్ణ నామస్మరణతో పాఠశాల ఆవరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పరస్పరం శ్రీకృష్ణాష్టమి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ గోవిందరెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, నర్సరీ విభాగం ఉపాధ్యాయురాళ్లు నాగరత్నమ్మ, లింగమ్మ, జయశ్రీ, సంగీత, నందినీ, ధనుశ్రీ, చంద్రకళ, కళావతి, మీనా తదితరులు పాల్గొన్నారు.


