ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని అందులో కోరారు. కాగా, ఈ పిటిషన్ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టేటస్ రిపోర్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాలో నిన్నటి వరకే 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యోగి సర్కార్ వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. సుమారు 40కోట్ల మంది వరకు భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు
RELATED ARTICLES