ఏపీ సీఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ లేఖ
విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (అర్టిటి) సంస్థకు ఎఫ్సీఆర్ఎ క్రింద వివిధ దేశాల నుండి అందే సహాయానికి సంబంధించి రెన్యూవల్ పునరుద్ధరణ చేసేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శుక్రవారం లేఖ వ్రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. 1969లో విన్సెంట్ ఫెర్రర్, అన్నే ఫెర్రర్ దంపతులచే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో స్థాపించబడిందన్నారు . గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, బాధలు, అన్యాయాలను నిర్మూలించడానికి, సమాన అవకాశాలు, సంపదను అందరికీ అందించడానికి ఈ సంస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత కరువు పీడిత ప్రాంతాల్లో ‘ఫుడ్-ఫర్-వర్క్’కార్యక్రమాన్ని ప్రారంభించిందని తద్వారా వేలాదిగా బావులు తవ్వటం, లక్షలాది గృహాల నిర్మాణం, కుష్టు వ్యాధి కేంద్రం స్థాపన వంటి పనులు చేపట్టిందన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభించి కూలీలను రైతులుగా మార్చడంలో సహాయపడిందన్నారు . గ్రామీణ సమాజాల్లో పేదరికం, బాధలు, అన్యాయాలను తొలగించి, స్థిరమైన అభివృద్ధి ద్వారా సమాణాన్ని సాధికారపరచడం, మహిళలు, పిల్లలు, వైకల్యం ఉన్న వ్యక్తులు, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం ఆర్డిటి సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు . విద్య, వైద్యం, గృహనిర్మాణం, స్థిరమైన జీవనోపాధి, సాంస్కతిక-క్రీడా కార్యక్రమాల ద్వారా పేదల అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి మొబైల్ లైబ్రరీలు, ట్యూషన్ స్కూళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్కాలర్షిప్లను అందిస్తోందని పేర్కొన్నారు. బత్తలపల్లి, కల్యాణదుర్గం, కనేకల్లలో రెండు సెకండరీ ఆసుపత్రులు, ఒక ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్ స్థాపించిందని, రోజువారీ 3,000 మంది పేదవారు ఈ ఆసుపత్రుల సేవలను వినియోగిస్తున్నారు అని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆదాయ ఉ త్పత్తి కార్యక్రమాలు, వృత్తి శిక్షణలు, మహిళల భద్రత, సమానత్వం కోసం కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వైక్యల్యంతో బాధపడుతున్న వారి కోసం కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ సెక్టర్ స్థాపించి, కృత్రిమ అవయవాలు, పునరావాస కేంద్రాలు, ఉపాధి అవకాశాలు అందిస్తోందన్నారు. ఎకాలజీ సెక్టర్ ద్వారా నీటి, నేల పరిరక్షణ, అటవీకరణ, హార్టికల్చర్ ప్రవేశపెట్టింది అని పేర్కొన్నారు. వేలాది మంది రైతులకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు అందించి, నీటి అదా, ఉత్పత్తి పెంపు సాధించిందన్నారు . సౌర ఫలకాల సహాయంతో స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది అని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం, రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నది. 2012లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి గృహ నిర్మాణంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపు లభించిందన్నారు . ఫెర్రర్ మరణానంతరం ఆయన కుమారుడు మంచో ఫెర్రర్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో మన్ననలు పొందారన్నారు .పేదల సంస్థగా పేరొందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (అర్డిటి) నెత్తిన కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చిందన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫిసిఆర్ఎ) కింద వివిధ దేశాల నుంచి ఆర్టీటీకి అందుతున్న సహాయానికి సంబంధించి రెన్యూవల్ పునరుద్ధరణను నిలిపివేసింది అని పేర్కొన్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఆర్టీటీ నిధుల కొరతతో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులే కాకుండా నేరుగా విదేశాల నుంచి నిధులు తెచ్చి, అనంతపురం జిల్లాతోపాటు రాయులసీమలోని అన్ని ప్రాంతాల్లో వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం మంచో ఫెర్రర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతోపాటు తదితర ప్రాంతాల్లో ఆర్టిటి సేవలు దాదాపుగా 3 వేలకు పైగా గ్రామాల్లో కొనసాగుతున్నాయి అని తెలిపారు. మొదట ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంస్థ చేపట్టిన సేవలు ప్రస్తుతం ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించాయన్నారు . అలాంటి సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధులను రాకుండా కేంద్రం అడ్డుకోవడంతో సంస్థ సేవల అమలులో గందరగోళ పరిస్థితి నెలకొంది అన్నారు . ఫలితంగా పేదలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు . కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రాయలసీమ ప్రాంతంలో రాజకీయాల కతీతంగా పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమవుతున్నారు అని తెలిపారు. తక్షణమే మీరు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, ఆర్డిటి సంస్థకు వివిధ దేశాల నుండి అందే ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎఫ్సీఆర్ఎ రెన్యూవల్ పునరుద్ధరించే విధంగా తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరారు.