ఆశ చూపి రూ.100 కోట్లు కొట్టేశాడు
పోలీసుల పాత్ర పై గుప్పుమంటున్న వైనం
మూడు పాత కేసులు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు
విశాలాంధ్ర -కావలి : ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. చాలామంది లాభపడ్డారు. దీనిని చూసి కొందరు ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి అడుపెట్టాలని అనుకుంటున్నారు. మరి కొందరు అయితే డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అనే ఆశతో అప్పులు చేసి మరీ పెట్టాలని అనుకుంటున్నారు. సరిగ్గా ట్రెండింగ్ లో ఉన్న పదాలనే పెట్టుబడిగా, తనకున్న ఠక్కు టమారి విద్యలకు స్థానికంగా పరపతి ఉన్న కొందరు జత కావడంతో కావలి ని అడ్డగా చేసుకొని గుంటూరు కు చెందిన ఒక ప్రబుద్ధుడు రూ.100 కోట్లు లూటీ చేశాడు.
ఎంత లూటీ అంటే…
కావలి పట్టణంలో రూ.100 కోట్లు లూటీ వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసి బురిడీ బ్రోకింగ్ కంపెనీ దుకాణం ఎత్తేసింది. సుమారు రూ.100 లూటీ జరిగినట్లు భావిస్తున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సయ్యద్ సుబాని మూడేళ్ల కిత్రం కావలి పట్టణానికి వచ్చి అనంతార్ధ అసోసియేట్స్ అనే పేరుతో స్టాక్ బ్రోకింగ్ దుకాణం ఏర్పాటు చేశాడు. కావలి పట్టణంతో పాటు చుట్ట పక్కల గ్రామాలకు చెందిన సంపన్నులు, ఉద్యోగులు, మధ్య తరగతి, కూలీ పనలు చేసుకుని బతికేవారు తదితర క్యాటగిరీలకు చెందిన వ్యక్తులు అధిక అదాయం ఆశ చూపడంతో అతనికి సమర్పించుకున్నారు. కావలి ప్రాంతంలో ప్రజల ఆశల బలహీనతలను గుర్తించిన సదరు స్టాక్ బ్రోకింగ్ దుకాణం నిర్వహకుడు కొందరు కమిషన్ ఏజెంట్లను కూడా నియమించుకుని వారి ద్వారా లూటీ పర్వానికి దూకుడు పెంచాడు. స్టాక్ బ్రోకింగ్ లో పెట్టుడబులు అంటూ నమ్మబలికి అమాయకుల నుంచి దర్జాగా డబ్బులు లూటీ చేయసాగాడు. పోలీసులు గత వారం రోజులుగా అతన్ని రహస్యంగా విచారిస్తుండటంతో అసలు లూటీ ఎంత జరిగింది, ఎంత మంది నగదు చెల్లించారు, లూటీ చేసిన నగదును ఏం చేశాడు, కమిషన్ ఏజెంట్లు ఎవరు తదితర అంశాలు వెలుగులోకి వస్తాయనేది అంతుచిక్కడం లేదు.అయితే బురిడీ స్టాక్ బ్రోకింగ్ దుకాణం నిర్వహకుడు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.బురిడీ స్టాక్ బ్రోకింగ్ దుకాణం నిర్వహకుడు అధిక వడ్డీలు, స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఆశచూపి డబ్బులు వసూలు చేశాడు. వడ్డీ, స్టాక్ మార్కెట్ లో వచ్చిన లాభాలు పక్కన పెడితే, అసలు కూడా ఇవ్వలేనంటూ చేతులెత్తేశాడు.
ఎలా వసూలు చేశాడంటే…
టాటా, బిర్లా, రిలయన్స్ వంటి వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించే షేర్ మార్కెట్ లో తాను నిష్ణాతుడినని స్థానికులను నమ్మించాడు. అలాగే షేర్ మార్కెట్ లో ఎలా పెట్టబడి పెట్టాలి, లాభాలు ఎలా వస్తాయో తాను ట్రైనింగ్ ఇస్తానని చెప్పసాగాడు. షేర్ మార్కెట్ పై అవగాహన లేకపోయినా, షేర్ మార్కెట్ కార్యకలాపాలపై సమయం కేటాయించే తీరిక లేకపోయినా డబ్బు సంపాదించే మార్గం తాను చూపిస్తానంటూ స్థానికులను నమ్మించాడు. అలా స్థానికుల నుంచి షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో జనాల నుంచి డబ్బులు వసూలు చేయసాగాడు. అప్పుగా డబ్బులు తీసుకున్నట్లుగా ప్రామసరీ నోట్లు రాసి ఇస్తుంటాడని చెబుతున్నారు. ప్రతి రూ. లక్ష రూపాయాలకు నెలకు రూ.6000, రూ.7,000,రూ.8,000 ఇలా మూడు క్యాటగిరీలుగా ఆదాయం పేరుతో ఇస్తుంటాడని అంటున్నారు. మీ డబ్బు ను షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టానని, మీ డబ్బుకు షూరిటీ కోసం నేను ప్రామసరీ నోట్లు రాసి ఇస్తున్నానని, ప్రతి నెలా షేర్ మార్కెట్ ద్వారా వచ్చిన ఆదాయాల్లో కొంత నేను తీసుకొని, కొంత మీకు ఇస్తానని నమ్మకం కలిగించాడు. దీంతో కావలి పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ ాషేర్ మార్కెట్ పెట్టుబడి్ణ అనే వ్యవహారంపై నమ్మకాలు పెంచుకొని తమ వద్ద ఉన్న నగదును, అప్పులు చేసి అతనికి ఇవ్వసాగారు. కోట్ల రూపాయలు అతనికి ఇచ్చారు. ఇలా కోట్లల్లో తీసుకున్న నగదు కు సంబంధించి, నెలకు ఆదాయం పేరుతో వారికి లక్షల్లో నగదు చెల్లిస్తున్నాడు. కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ వృత్తులు చేసుకొనేవారు, చిరు పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు ఇలా వివిధ వర్గాల చెందిన వ్యక్తులు షేర్ మార్కెట్ వాలా కు రూ. లక్షలు అప్పగించారు.
అనుమానాలపై దబాయింపుతో
అతని కార్యకలాపాలపై ఆరా తీసిన వ్యక్తులను దబాయింపు, కొందరు పోలీసులతో హెచ్చరికలు కూడా చేయించాడు. ఇతను వ్యవహారంలో అనేక సంక్లిష్టమైన ప్రశ్నలు తలెత్తుతూ అనుమానాలు చాలా మందిలో అప్పట్లోనే అనుమానలు వచ్చాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే ప్రాసరీ నోట్లు ఎందుకు రాసి ఇస్తున్నట్లు, షేర్ మార్కెట్ అనేది ప్రతి రోజూ ధరలు పెరగడంఉతగ్గడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి నెల ఆదాయం కచ్చితంగా ఇంత వచ్చిందని చెప్పలేని విధంగా ఉంటుంది. అలాగే చాలా సార్లు షేర్ ధరలు పతనమైపోయి నష్టాలు కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు ఇతను ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక రూ.లక్ష కు రూ.6,000, రూ.7,000, రూ.8,000 ఎలా ఆదాయంగా ఇస్తున్నాడనిదే సమాధానం లేని అనుమానాలుగానే ఉంటుండేవి. గతంలో కావలి కేంద్రంగా హిమ్ అనే పేరుతో నగదు లూటీ జరగడం, హిమ్ ను నడిపిన వ్యక్తులకు సమర్పించుకుంటే అప్పనంగా భారీగా నగదు తిరిగి చెల్లిస్తారనే ఆశ కల్పించి అనేక మంది ూ కుంగిపోయిన ఘటన కావలిలో జరిగి ఉంది.
సంక్లిష్టంగా పోలీసులు విచారణ
ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా కొందరు పోలీసులు చలామణి అయినట్లుగా పోలీసు అధికారులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ లూటీ వ్యవహారంలో ఇంకా లోతుగా విచారణ చేస్తే ఎవరెవరు జాతకాలు బయటకు వస్తాయోనని పోలీసు అధికారులు ఆసక్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ాకోట్లు లూటీ వాలా్ణ ను పలువురు పోలీసు అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు డీఐజీ, జిల్లా ఎస్పీ ల కు ఈ దర్యాప్తు లో పురోగతి సమాచారాన్ని తెలియజేస్తున్నారు. లూటీలో కీలకంగా ఉన్న ముగ్గరు పోలీసులు పాత్ర ఒక రకంగా ఉంటే, మరి కొందరు పోలీసులు అధిక వడ్డీ, షేర్ లో లాభాలు అనే మాటకలు ఆశ పడి లక్షలాది రూపాయలు ఇచ్చారు. అలాగే మహిళా పోలీసులు, హోం గార్డులు కూడా పెట్టుబడి అనే పేరుతో లక్షలాది రూపాయలు ఇచ్చారు. అలాగే పోలీసు అధికారులు కూడా అతనికి అధిక రాబడికి ఆశ పడి పెట్టుబడి గా లక్షలాది రూపాయలు ఇచ్చినట్లుగా గుర్తించారు.
కాగా పోలీసులు దర్యాప్తులో లూటీ చేసిన నగదులో సేమారు రూ.10 కోట్లు విలువ చేసే ఆస్తులు మాత్రమే బురిడీ షేర్ మార్కెట్ దుకాణం దారుడు వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే కాకినాడ, రంగారెడ్డి జిల్లాలోని మక్తల్, కర్నాటక లో గతంలో చేసిన మోసాలకు సంబంధించి పోలీస్ కేసులు నమోదు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన నగదు అంతా కూడా మూడేళ్లుగా అతని అన్ని రకాలుగా అండగా ఉన్న వ్యక్తులు, ఇతర వ్యవహారాలకు కోసం హారతి కర్పూరం అయినట్లుగా భావిస్తున్నారు. భాధితులు కూడా పోలీసులకు రహస్యంగా తమ గోడు చెబుతున్నారు. పోలీసులు కూడా భాధితులకు న్యాయం చేసేందుకే సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వారం రోజులు నుంచి అతన్ని రహస్యంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, దీనిని ఎలా ముగించాలో స్పష్టత రాలేకపోతున్నారు. వసూలూ చేసిన కోట్ల రూపాయలు అతని వద్ద లేదని తేల్చి చెబితే, ఏమైపోయినట్లుగా, ఎవరి వద్ద కు చేరినట్లు ప్రశ్నలు తలెత్తుతాయని విచారణ చేస్తున్న పోలీసులు తటపటాయిస్తున్నారు. అతనికి ఏజెంట్లుగా పని చేసి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన కొందరు పోలీసులు, అతని వద్ద నుంచి ఏ మేరకు గడించించి లెక్కలు చెప్పకుండా దాచేస్తే మాత్రం దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సమస్యలు ముసురుకునే సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.