సిపిఐ నాయకుల వినతి
అక్రమంగా నిర్మించారని రేకుల షెడ్డును కూల్చివేసిన అధికారులు
జాతీయ రహదారి పక్కనే కోట్ల రూపాయల విలువచేసే ఇదే స్థలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాల కూల్చివేతకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?…
ముదిగుబ్బ మండల సిపిఐ నాయకులు.. చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర-ముదిగుబ్బ/ధర్మవరం : మండల కేంద్రమైన ముదిగుబ్బ లో పట్టణ నడిబొడ్డున జాతీయ రహదారి పక్కన ఉన్న కోట్ల రూపాయలు విలువచేసే సొసైటీ బ్యాంక్ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ నాయకులు గురువారం ముదిగుబ్బలో సొసైటీ బ్యాంకు సీఈఓ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంగాల సొసైటీ బ్యాంక్ స్థలాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్రమిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు 50 సెంట్లు స్థలం కబ్జాకు గురైనట్లు తెలిసిందన్నారు, ఇదిలా ఉండగా ఈ స్థలంలో ఒక మూలన ఇటీవల అక్రమంగా నిర్మించారని, ఒక చిన్న రేకుల షెడ్డును రెండు రోజులు కిందట కూల్చివేసిన అధికార పార్టీ నాయకులు, అధికారులు జాతీయ రహదారి పక్కన కోట్ల రూపాయలు విలువచేసే ఇదే సొసైటీ స్థలంలో అక్రమంగా నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను కూల్చివేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని సిపిఐ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టిడిపి, వైసిపి ప్రభుత్వం లో అప్పటి నాయకులు ఈ భూ కబ్జా దారులతో కుమ్మక్కై భారీ ఎత్తున అవినీతికిపాల్పడి ఈ ప్రభుత్వ స్థలంలో జాతీయ రహదారి ప్రక్కనే అక్రమంగా పెద్ద పెద్ద భవనాలు నిర్మించినా ..పట్టించుకోలేదని ఆరోపిస్తూ మండిపడ్డారు.ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారుల సైతం అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలోగ్గి, తమ సొసైటీ బ్యాంక్ స్థలంలో కళ్ళ ముందరే అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులైన టిడిపి నాయకులు, కొంతమంది
ఈ అక్రమ కట్టడాల నిర్మాణం పై హైకోర్టును ఆశ్రయించినా ,నేటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడం విచార కనుమన్నారు. కనుక ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ఈ సొసైటీ స్థలంలో జాతీయ రహదారి పక్కన నిర్మించిన అక్రమ కట్టడాల నిర్మూలనకు చర్యలు తీసుకోవడమే గాక ఈ స్థలం భవిష్యత్తులో ఆక్రమణకు గురి కాకుండా ఈ స్థలం చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు, లేనిపక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే మేము కూడ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఈ అక్రమ కట్టడాలు కూల్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సౌత్ స్టేట్స్ గౌరవాధ్యక్షులు
బి వెంగమేష్ చౌదరి మద్దతు పలికిన ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ స్థానిక నాయకులు తిప్పయ్య , గంగిరెడ్డిపల్లి నాయుడు, తుమ్మల చిన్నప్ప, ఈశ్వర్ నాయక్, మల్లాది లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.