విశాలాంధ్ర – ఆదోని : మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆదోని డీఎస్పీ హేమలత హెచ్చరించారు. రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా బుధవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి కోట్ల సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీదుగా కంట్రోల్ రూమ్ సర్కిల్, తిక్క స్వామి దర్గా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆదోని బైపాస్ రోడ్డు నుండి రెండో పోలీస్ స్టేషన్ వరకు డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ హేమలత మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని, వాహనాలకు సంబంధించిన రికార్డులన్నీ కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత మైనర్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, ర్యాస్ డ్రైవింగ్ లాంటివి చేసే వారితోపాటు వారి తల్లిదండ్రులపై కఠిన తీసుకుంటామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదాల బారినపడి విలువైన ప్రాణాలను పోగొట్టుకోకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనాలకున్న సైలెన్సర్లను తీసి వాహనాలు నడిపిన అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, కళాశాలలకు తమ విద్యార్థులు ద్విచక్ర వాహనాలతో వస్తే కళాశాల యాజమాన్యాలతో కలిసి స్పెషల్ డ్రైవ్ తో అవగాహన కల్పిస్తామని, ద్విచక్ర వాహనాల తో విద్యార్థులు కళాశాలలకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడేలా చర్యలు చేపడతామని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రజలు, వ్యాపారులు, దుకాణదారులు, ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ గంటా సుబ్బారావు, రెండవ, మూడవ పట్టణ సిఐలు మోహన్ రావు, రామలింగయ్య, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.