విశాలాంధ్ర-రామగిరి : పచ్చని పొలాల మధ్య వరినాట్లు వేసే మహిళా కూలీగా మారి ఒకవైపు, ప్రజా సేవకురాలిగా మరోపక్క గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ ఎమ్మెల్యే పరిటాల సునీత గడిపారు. చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్ చెరువు గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం రామగిరిలో వ్యవసాయ పొలాల్లో మహిళలు వరినాట్లు వేస్తుండటంతో వారితో కలసి మడిలో దిగి కూలీలతో వరినాట్లు వేస్తూ సందడిగా గడిపారు. పింఛనుదారులైన రైతు కూలీలకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారా ఎవరైనా సచివాలయానికి వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారా అని లబ్ధిదారులతో ఆరా తీయగా
చంద్రబాబు సీఎం అయిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదిన ఇంటి వద్దకే వచ్చి వేతనంలా పింఛన్లు అందిస్తున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ కృష్ణమ్మ నీటితో వ్యవసాయ పొలాలు పులకిస్తున్నాయని, అలాంటి చోటికి వచ్చి కూలీలకు పింఛన్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాట ఇస్తే అది నిలబెట్టుకునే ప్రభుత్వం ఇది అని, సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన పింఛన్ల పెంపు తొలి నెలలోనే అమలు చేశామన్నారు. గతంలో మాదిరి పార్టీలు చూడకుండా అర్హత ఉంటే ఎవరికైనా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఎవరైనా మహిళలు భర్తను కోల్పోతే అదే నెల నుంచి వితంతు పింఛన్ ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ పనితీరు మీద వైసీపీ నాయకులు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రజల్లో కనిపిస్తున్న ఆనందమే మా పనితీరుకి అద్దం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ఓవైపు మహిళా కూలీగా, మరోవైపు ఎమ్మెల్యే హోదాలో ప్రజా సేవకురాలిగా సునీత
RELATED ARTICLES