కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కల్నల్ సోఫియా ఖురేషీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా
హైకోర్టు ఆదేశాలతో ఆయనపై కేసు కూడా నమోదు
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మంత్రి
ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సూచన
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కున్వర్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ మాట్లాడిన ఆయన ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారని… వాళ్ల మతానికి చెందిన సోదరిని ప్రధాని మోదీ సైనిక విమానంలో పాక్కు పంపించి పాఠం నేర్పించారని అన్నారు. అయితే, కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ విజయ్ షా చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి.
హైకోర్టు ఆదేశాలతో ఆయనపై కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. హైకోర్టు ఆదేశాలపై మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, మంత్రి పిటిషన్ను రేపు (శుక్రవారం) విచారించేందుకు అంగీకరించిన కోర్టు… ఆయన తీరును తప్పుపట్టింది.
ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అటు మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా మండిపడిన విషయం తెలిసిందే. బాధ్యతగల పదవుల్లో ఉండి దేశానికి రక్షణ కల్పిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. సాయుధ బలగాల్లో పనిచేసే అధికారుల పట్ల ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా వ్యవహరించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.