పెగాసస్ స్పైవేర్ వివాదంపై సాంకేతిక కమిటీ సమర్పించిన నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన సున్నితమైన అంశాలున్నందున ఈ నివేదికను బయటపెట్టలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దేశ భద్రతకు సంబంధించిన నివేదికలోని అంశాలను బహిరంగ చర్చకు పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏ నివేదికనూ మేం బహిర్గతం చేయబోం. అటువంటి నివేదికలను వీధి చర్చల పత్రంగా మార్చకూడదుఁ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెగాసస్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో వ్యక్తిగత గోప్యతా ఉల్లంఘనకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించే విషయాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం సూచనప్రాయంగా తెలిపింది. గోప్యతా హక్కుకు భంగం వాటిల్లిందని భావించే వ్యక్తుల నిర్దిష్ట కేసులను పరిశీలించే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫిర్యాదులను వినేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెగాసస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాంకేతిక నిపుణుల కమిటీని గతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ నివేదికను సమర్పించినప్పటికీ, దానిలోని అంశాలను గోప్యంగా ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది.