Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్కుటుంబ వ్యవస్థ క్షీణతపై సుప్రీంకోర్టు ఆందోళన

కుటుంబ వ్యవస్థ క్షీణతపై సుప్రీంకోర్టు ఆందోళన

వసుధైక కుటుంబం భావనను విస్మరిస్తున్నామని వ్యాఖ్య
కుటుంబ కలహాలపై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు
ఒంటరి కుటుంబాల సంఖ్య పెరుగుతోందని ఆవేదన

భారతీయ కుటుంబ వ్యవస్థ క్షీణిస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వసుధైక కుటుంబం అనే భావనను విశ్వసించే మనం సొంత కుటుంబ సభ్యులతోనే కలిసి ఉండలేకపోతున్నామని కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ ధోరణి ఒంటరి కుటుంబాలకు దారితీస్తోందని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన పెద్ద కొడుకును ఇంటి నుంచి బయటికి పంపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కుమారుడు తల్లిని అవమానించాడని లేదా ఆమె జీవితంలో జోక్యం చేసుకున్నాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఆస్తికి తండ్రి మాత్రమే యజమాని అని చెప్పలేమని, కుమారుడికి కూడా అందులో వాటా ఉంటుందని కోర్టు పేర్కొంది. కొడుకును ఇంటి నుంచి పంపించేంత తీవ్రమైన చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ జిల్లాకు చెందిన కల్లూ మాల్‌, సంతోలా దేవీ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుమారులకు, తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాల్లేవు. తమ కుమారుల నుంచి జీవనభృతి ఇప్పించాలంటూ 2017లో స్థానిక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా… తల్లిదండ్రులకు నెలకు రూ.8 వేలు చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడికి, తల్లిదండ్రులకు మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. ఇది కొనసాగుతుండగానే… కల్లూ మాల్‌ మృతి చెందారు. దాంతో సంతోలాదేవి తన పెద్ద కుమారుడికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆమె పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది. మనమంతా వసుధైక కుటుంబం అనే భావనను నమ్ముతామని, కానీ కుటుంబ ఐక్యతను కాపాడుకోవడంలో విఫలమవుతున్నామని పేర్కొంది. కుటుంబం అనే భావన కనుమరుగవుతోందని, మనం ఒక వ్యక్తి, ఒక కుటుంబం అనే వ్యవస్థకు చేరువలో ఉన్నామని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు