తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను తన వద్దే పెట్టుకునే వీటో అధికారం గవర్నర్‌కు లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పర్దివాలా, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు అక్రమం అని పేర్కొన్న కోర్టు.. ఆయన వద్ద పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని, అయితే బిల్లులో వైరుధ్యం ఉంటే దాన్ని తిరస్కరించాలని కోర్టు పేర్కొన్నది. తమిళనాడు శాసనసభ పంపిన పది బిల్లులను గవర్నర్ రిజర్వ్‌లో పెట్టుకోవడం అక్రమం అని, న్యాయ వ్యతిరేకమైందని, అందుకే ఆ చర్యలను పక్కన పెడుతున్నామని, ఆ బిల్లులను గవర్నర్‌కు సమర్పించిన నాటి నుంచి వాటికి క్లియరెన్స్ దక్కినట్లు కోర్టు ప్రకటించింది. తమ బిల్లులకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్ల చాలా చురుకుగా పనిచేయాలని కోర్టు పేర్కొన్నది. ఓ స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా గవర్నర్ పనిచేయాలని కోర్టు సూచించింది.
రాజకీయ ప్రేరణతో ఆయన పనిచేయరాదని ధర్మాసనం తెలిపింది. సమస్యలు పరిష్కరించడంలో గవర్నర్ ఓ దూతలా ఉండాలని, ఓ ఉత్ప్రేరకంగా పనిచేయాలని కోర్టు చెప్పింది. రాజ్యాంగ విలువల్ని గవర్నర్లు రక్షించాలని కోర్టు తెలిపింది. 2020 నుంచి 2023 వరకు సుమారు 12 బిల్లలను తమిళనాడు అసెంబ్లీ.. గవర్నర్ అనుమతి కోసం పంపింది. కానీ గవర్నర్ ఆ బిల్లులను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఆ బిల్లుల అనుమతి కోరుతూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే 2023 నవంబర్‌లో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, మరో 10 బిల్లులు గవర్నర్ వద్దే ఉండిపోయాయి. అయితే కొన్ని రోజుల వ్యవధిల్లో మళ్లీ ఆ పది బిల్లులను రాష్ట్ర శాసనసభలో పాస్ చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనుమతి కోరుతున్నట్లు తమిళనాడు సర్కారు తన పిటీషన్‌లో సుప్రీంకు తెలిపింది.