విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నరసింహాచారి కోరారు. గురువారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ పథకాన్ని ఈ నెల ఆఖరి వరకు పొడగించినట్లు తెలిపారు. ఈ పథకం కోసం అప్లై చేసుకున్న వారు నెట్ సెంటరు నందు ఇచ్చిన ఫారాలను, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటోను తీసుకుని ఎమ్మిగనూరులోని సిద్దార్థ కాలేజి రెండో అంతస్తులోని విశ్వకర్మ కౌశల్ యోజన కేంద్రం నందు ఇవ్వాలని కోరారు. కేంద్రం వారు మీకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని తెలిపారు. ఎన్నికైన వారికి శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. కోసిగి, మంత్రాలయం, పెద్దకడబూరు మండలాల వారు తమ అప్లికేషన్లు సిద్దార్థ కాలేజిలో ఇవ్వాలన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి మీకు ఫోన్లు వస్తే నమ్మవద్దని అవి అన్నీ కూడా ఫేక్ ఫోన్లు అన్నారు. మీరు కేవలం కర్నూలు జిల్లా నుంచి వచ్చిన ఫోన్లు మాత్రమే నమ్మాలని కర్నూలు విశ్వకర్మ కౌశల్ యోజన పథకం కేంద్రం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.