Wednesday, March 12, 2025
Homeతెలంగాణప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

బీఆర్ఎస్ నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు రూ. 500 బోనస్, కృష్ణా జలాల అంశాలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు.

ప్రజలే కేంద్రంగా పాలన

తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని గవర్నర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సాకారానికి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సహా అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతులు రాష్ట్రానికి ప్రాణం వంటి వారని, రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందని తెలిపారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇది మన రైతుల స్థిరత్వం, అంకితభావానికి నిదర్శనమని అన్నారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. రైతుకు పంట సాయాన్ని రూ. 12 వేలకు పెంచినట్లు చెప్పారు. వరి రైతులకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్‌గా ఉందని, ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. తెలంగాణ పురోగమించడమే కాదని, రూపాంతరం చెందుతోందని గవర్నర్ అన్నారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్‌తో పని చేస్తున్నామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు