Saturday, May 10, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి.. రైల్వే మంత్రికి లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి

తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి.. రైల్వే మంత్రికి లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి

జలంధర్, జమ్మూ, కురుక్షేత్ర, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు కోరిన ఎంపీ
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఉత్తరాది రాష్ట్రాలలో విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్థుల భద్రతపై టీడీపీ పార్లమెంటుసభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడానికి వీలుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రికి ఒక లేఖ రాశారు. హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా జలంధర్‌, జమ్మూ, కురుక్షేత్రల్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్‌లతో పాటు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు అధికంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. ఈ విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. తక్షణమే స్పందించి, విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు