Tuesday, March 11, 2025
Homeజిల్లాలుపశ్చిమ గోదావరినా భర్తను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

నా భర్తను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

విశాలాంధ్ర –పెంటపాడు : తన భర్తను హత్య చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆరోపిస్తూ పెంటపాడు సెంటర్లో సోమవారం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన చందనాల ఉమాదేవి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీన తన కుమార్తె కాపురం విషయమై తన భర్త చందనాల పెద వెంకటేశ్వరరావు, తాను మాట్లాడేందుకు గొల్లవానితిప్ప వెళ్ళామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం భోగిరెడ్డి శ్రీను, చందనాల నాగమణి, భోగి రెడ్డి రత్నమాణిక్యం, బంధువులు తన కుమార్తె వద్దకు ఎందుకు వెళ్లారని ఘర్షణ పడి బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. అదే రోజు ఉదయం 8 గంటలకు తన భర్త గేదెల పాక వద్దకు వెళ్లాడని, 9:30 గంటలకు ఉరిపోసుకుని మృతి చెందినట్లు తనకు సమాచారం వచ్చిందని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాకుండానే తన భర్త భౌతికకాయాన్ని గడ్డి పై పడుకోబెట్టారన్నారు. ఈ విషయంపై తన కుమార్తె స్వాతి 112 ఫోన్ చేసి పోలీసులకు తెలియజేసిందన్నారు. అయితే, పోలీసులు తమను విచారించకుండా పోస్టుమార్టం నిమిత్తం కాగితాలపై సంతకాలు పెట్టాలని అడిగారన్నారు. ఆదివారం కదా పోస్టుమార్టం ఎలా అవుతుందని తమ బంధువులు ప్రశ్నించారన్నారు. అయితే, పడమర విప్పర్రు గ్రామానికి చెందిన ఘంటా సుబ్రహ్మణ్యం సహకారంతో తన భర్త హత్యకు పాల్పడిన వారే పోస్టుమార్టం చేయించి అప్పగించారన్నారు. హత్యను ఉరిపోసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు . తన భర్త హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే, తమ కుటుంబ సభ్యులు అంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు

బాధితులకు బాసటగా
–మాజీ మంత్రి కొట్టు :
పెంటపాడు సెంటర్లో నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చందనాల ఉమాదేవి ఆమె కుమార్తె స్వాతి లను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందనాల పెద వెంకటేశ్వరరావు హత్యకు కారణమైన నిందితులను అరెస్ట్ చేసి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, పోలీసులను బాధ్యులను చేయాలన్నారు. జిల్లా ఎస్పీ తో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాటం చేస్తామన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు