విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : అహంకారపు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ ను అసిస్టెంట్ మేనేజర్ వేణు ను సస్పెండ్ చేయాలంటూ సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, పార్టీ సభ్యులు రాజు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు సబ్సిడీ యూనిట్స్ ను కేటాయించిందన్నారు. పెద్దకడబూరు మండలానికి 50 యూనిట్లు కేటాయించి, 91.5 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. దీంతో అర్హులైన నిరుద్యోగులు ధరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇక్కడికి అధికారులు అర్హులైన వారికి కాకుండా రాజకీయ నాయకులు సూచించిన వారికే యూనిట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కావున అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన నిరుద్యోగులకు యూనిట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాతాదారుల సమస్యలపై ధర్నా అనంతరం సీపీఐ పార్టీ బ్యాంకు మేనేజర్ కు వినతిపత్రం ఇవ్వాలని చూస్తే గంటవరకు బయటకు రాకుండా అహంకార పూరితంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బ్యాంకు మేనేజర్ నిరంజన్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, రెక్కల గిడ్డయ్య, మారెప్ప, ఆంజనేయ, లక్ష్మన్న, నాగేష్, రాము, బాబు తదితరులు పాల్గొన్నారు.