యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (వీణ=) చార్జీల విధింపుపై దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. . ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ అంశంపై సాధారణ ప్రజలు, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, దీనివల్ల ఖాతాదారులపై పైసా భారం కూడా పడబోదని తేల్చిచెప్పారు. చాలామంది ఈ నిబంధనను సరిగ్గా అర్థం చేసుకోకుండా అపోహలకు గురవుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ₹2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే నిర్దిష్ట లావాదేవీలపై విధించే ఎండీఆర్ చార్జీలు కేవలం వ్యాపారులకు (మర్చంట్స్) మాత్రమే వర్తిస్తాయని, ఇప్పటికే వారు డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపుల విషయంలో ఈ రుసుములను భరిస్తున్నారని గుర్తుచేశారు. కార్డుల మాదిరిగానే ఈ భారాన్ని కూడా వ్యాపారులు కస్టమర్లపై మోపే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎండీఆర్ స్వరూపాన్ని వివరిస్తూ.. ఇది కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను (ట్యాక్స్), సెస్, సర్ ఛార్జ్ ఎంత మాత్రం కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా వసూలయ్యే మొత్తం నయాపైసా కూడా భారత ప్రభుత్వ ఖజానాకు చేరదని కుండబద్దలు కొట్టారు. డిజిటల్ నెట్వర్క్ను నిరంతరం నడిపించే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ గేట్వేల నిర్వహణ వ్యయం కోసం మాత్రమే ఇది ఉద్దేశించబడిందని, మార్కెట్లో ఇప్పటికే అమలులో ఉన్న ఇతర కార్డుల నియమ నిబంధనల ప్రకారమే దీనిని సమర్థిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు అయోమయానికి గురి కావద్దని, దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ ఎప్పటిలాగే సామాన్యులకు ఉచితంగా, నిరాటంకంగా కొనసాగుతుందని వివరించారు.


