విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పైరాయ ఆంజనేయ స్వామి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ కేంద్రంను ఆయన పరిశీలించారు. గో మూత్రం వెల్లుల్లి, పచ్చిమిర్చి, పొగాకు, వేపాకులతో తయారు చేసిన కషాయాలు, ద్రవణాలను అవి తయారు చేసే విధానం గురించి నిర్వహుకుడు అనీల్ ను అడిగి తెలుసుకున్నారు. పురుగు మందులు వాడని వ్యవసాయ క్షేత్రాలను, ఏటిఎమ్ మోడల్స్, వేరుశనగ పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో పురుగుమందులు, రసాయనిక ఎరువుల వినియోగము అధికం కావడం వల్ల మనుషులు క్యాన్సర్ మొదలగు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఈ విషయాలను గమనించి బసలదొడ్డి గ్రామ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడం శుభపరిణామమని అన్నారు. అయితే ఈ పద్దతులు అధిక సంఖ్యలో రైతులు పాటించినప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చునన్నారు. పురుగుమందులు వాడకుండా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రదర్శించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాన్ పెస్టీసైడ్ మేనేజ్మెంట్ మాస్టర్ ట్రైనర్ అనిల్ కుమార్, వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు, రైతులు చక్రపాణి, ఉసేని, గోవిందు, సతీష్, తిమ్మారెడ్డి, గోపాల్ తదితర రైతులు పాల్గొన్నారు.