విశాలాంధ్ర ధర్మవరం:: ప్రపంచంలోనే యువకుల జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం అని, నేటి యువత దేశ భావి భారత నిర్మాతలని ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచానికి భారత ఆహార్యాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పి, అంతర్జాతీయ స్థాయిలో సనాతన ధర్మాన్ని పరిచయం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని ఆయన పేర్కొన్నారు. ఆ మహనీయుడి స్పూర్తితో నియోజకవర్గ యువత దేశ స్థాయిలో రాణించాలని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ వారితో నియోజకవర్గ నిరుద్యోగ యువతకు సివిల్స్ నందు ఉచిత శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. అలాగే నన్ను అక్కున చేర్చుకుని ముందుకు నడిపిస్తున్న నియోజకవర్గ యువతీయువకులకు ఒక అన్నగా నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ గత వారం రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున 99 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించటం జరిగిందని, దాదాపుగా 1800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని,1000 మందికి పైగా రెండవ దశకు అర్హత సాధించారని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి సందర్భంలోనైనా మీకు అండగా మీ అన్న సత్యకుమార్ యాదవ్ ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్, ధర్మవరం నియోజకవర్గ భాజపా నేతలు హరీశ్ బాబు,సందిరెడ్డి శ్రీనివాసులు, జింకా చంద్రశేఖర్,మంత్రి కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
యువత చేతిలోనే దేశ భవిత.. మంత్రి సత్య కుమార్ యాదవ్
RELATED ARTICLES