గతం కన్నా మిన్నగా మెరుగైన అవకాశాలు కల్పిస్తాం
ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ కుమార్
విశాలాంధ్ర – అనంతపురం : ఎస్సీల ఆర్థికాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేయనున్నా మని ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక దామోదరం సంజీవయ్య భవనంలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఎస్సీలకు చెందిన మాల, మాదిగల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. గతం కన్నా మిన్నగా వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామన్నారు. వారి ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తామన్నారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీలకు సంబంధించిన అన్ని అంశాలపై లోతైన అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్పొరేషన్ కార్యాలయాల్లో ఎస్సీలకు అందిస్తున్న పథకాలు,సేవలపై సమీక్షాసమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ డాక్యుమెంట్ , 2047 లో భాగంగా ఎస్సీ కుటుంబాల నుంచి పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వారికి ఆసక్తి ఉన్న రంగంలో వారిని తీర్చిదిద్ది పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. గత పాలకులు ఐదేళ్లపాటు సబ్ ప్లాన్ నిధులను ఇష్టానుసారంగా ఇతర పథకాలకు మళ్లించారని, ఎస్సీలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగాఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కె.కమలమ్మ మాట్లాడుతూ, అనంతపురం జిల్లాకు విచ్చేసిన చైర్మన్ దృష్టికి జిల్లా సమస్యలను తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తోందన్నారు.l
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాధిక మాట్లాడుతూ, ఎస్సీలకు అందిస్తున్న పథకాలపై చైర్మన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారన్నారు. వారి సూచనల మేరకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.