ఇంజనీరింగ్ కార్మికులకు గత సమ్మె హామీ ప్రకారం వేతనాలు పెంచాలి
-ఏ పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్
విశాలాంధ్ర అనంతపురం : మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కమీషనర్ బాలస్వామి,మేయర్ వసీం సలీం లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కొత్త విధానాలు తీసుకువచ్చి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. పర్మినెంట్ చేయాలన్న ప్రధానమైన సమస్యని పట్టించుకోవడం లేదన్నారు,అవుట్సోర్సింగ్ కార్మికులుగా విధుల్లో చేరి అవుట్సోర్సింగ్ కార్మికులుగానే రిటైర్మెంట్ అవుతున్నారన్నారు. గత సమ్మెలో ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని ఇంతవరకూ అమలుచేయలేదన్నారు. 15 వేల వేతనంతో కుటుంబాల పోషణకు ఇబ్బందిగా మారిందన్నారు. స్కూల్ స్వీపర్లు కు వాచ్మెన్లకు గత 10 సం,ల నుండి వేతనాలు పెంచడం లేదన్నారు. 4 వేలు వేతనం ఇస్తూ కార్మికులతో రోజంతా పనిచేయించుకుంటూ నెలల తరబడి వేతనాలు బకాయి పెడుతున్నారన్నారు. వీరిని ఫుల్ టైమ్ వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచి పనివత్తిడి తగ్గించాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. బకాయి ఉన్న 9 నెలల ఈపీఎఫ్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. కార్మికులకు పనిముట్లు వెంటనే ఇవ్వాలన్నారు,ఇతర కార్మిక సమస్యలపై దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, ఏ పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి,జిల్లా కోశాధికారి వేణుగోపాల్,జిల్లా సమితి సభ్యులు నాగరాజు,నాగేంద్ర బాబు,తిరుమలయ్య,ప్రసాద్,ఎర్రప్ప,అసేన్,కుళ్ళాయప్ప,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.