Homeజిల్లాలుఅనంతపురంఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

- Advertisement -


అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున పోరాటం

మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ హెచ్చరిక

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను రాజకీయ పార్టీలకు అతీతంగా, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నార్పల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కేంద్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన ఆయన, ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం ఆయన నేతృత్వంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఓటర్ల జాబితా సవరణలో బూత్ స్థాయి అధికారులు పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని శైలజానాథ్ కోరారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించబోమని స్పష్టం చేశారు.
అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినా, అర్హులైన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో పాటు న్యాయపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు నాగేశ్వరావు, బీసీ విభాగం అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, మండల బూత్ కమిటీల అధ్యక్షుడు యుగంధర్, జిల్లా యువ విభాగం నాయకులు గవ్వల సాయికృష్ణ, సోహైల్ తన్వీర్, జిల్లా విద్యార్థి విభాగం నాయకులు హరినాథ్ రెడ్డి, మహేష్ నాయక్‌తో పాటు పార్టీ నాయకులు, పోలింగ్ కేంద్ర స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు