ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై త్వరలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీకి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లేఖ రాశారు. దీంతో కొడాలి నాని కదలికలపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణ చిరునామాతో పాస్ పోర్ట్ సృష్టించుకుని ఆయన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారని సమాచారం.ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై లుకౌట్ నోటీసుల జారీకి అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. లుకౌట్ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తి దేశం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారులు అడ్డుకుంటారు.