రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులతో పాటు పిల్ల కాలువలకు ప్రాధాన్యత కల్పించాలి …
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విశాలాంధ్ర -అనంతపురం : పాకిస్తాన్ వివిధ పేర్లతో ఉన్న టెర్రరిస్టులకు ఒక హబ్ మారిందని దీనిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అతి చిన్న వయసులోనే యుద్ధభూమిలో మొదటి వీరమరణం చెందిన మురళి నాయక్ పార్థివ దేహానికి అర్పించడానికి అనంత జిల్లాకు రావడం జరిగిందన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అన్నారు. అక్కడ ముస్లింలు పాకిస్తాన్ పై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై ఆచితూచి యుద్ధం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులపై తీసుకుంటున్న చర్యలను ముక్తకంఠంతో ఆశించడం జరిగిందన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం పై మీడియా సమన్వయం పాటించాలన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనీవా కాల్వ విస్తీర్ణ పనులను పరిశీలించడం సంతోషకరమన్నారు. దీనితోపాటు సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ చేపడతామని దీనికి రూ. 81 వేల కోట్లు అవసరం అయినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నామని చెప్పడం జరిగిందన్నారు. ప్రాజెక్టులు కట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేక అప్పు తీసుకొని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడుకు పెద్ద ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ రిజర్వాయర్ల ద్వారా పిల్ల కాలువల ద్వారా ఆరు లక్షల ఎకరాలకు నీటిని సాగునీరు, తాగునీరు అందించే దిశగా దృష్టి పెట్టాలన్నారు. అనంత జిల్లాలోని ఆర్ డి టి నిధులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రానికి వివరిస్తానని తెలియజేశారన్నారు. ఆర్డిటి విషయంపై ఈనెల 13న విజయవాడ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాసరి భవన్ సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశ అనంతరం స్వయంగా కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, మంత్రులు ఉరవకొండలో పర్యటిస్తూ హంద్రీనీవా ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పడం జరిగిందన్నారు. హంద్రీనీవా రెండో దఫా కాంక్రీట్ పనులు వేసిన తర్వాత ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి పిల్ల కాలువ ద్వారా ఏ విధంగా ఇవ్వగలుగుతారన్నారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంపై శ్రద్ధ చూపాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి వేమయ్య, అనంతపురం జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె. రాజారెడ్డి, ఏపీ కాలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాటమయ్య, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.