Homeతెలంగాణచేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి

చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి

- Advertisement -
  • చేనేత శాలువాల వినియోగాన్ని ప్రోత్సహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
  • నాంపల్లిలో చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ నూతన కార్యాలయం ప్రారంభం
  • చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి
  • అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి
    విశాలాంధ్ర – హైదరాబాద్‌: తెలంగాణ చేనేత వస్త్రాలకు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నాంపల్లిలోని చేనేత భవన్‌లో తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్పొరేషన్‌ నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాలని మంత్రి సూచించారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు సరైన మార్కెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చి, వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ముడిసరుకు నుంచి వస్త్రాల తయారీ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ వరకు చేనేత రంగంలోని ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దేవాలయాలు, అధికారిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు, ప్రముఖుల సన్మానాల్లో సాధారణ సిల్క్‌ శాలువాలకు బదులుగా తెలంగాణ చేనేత శాలువాలను వినియోగించాలని పొన్నం ప్రభాకర్‌ సూచించారు. రాజకీయ నాయకులు పరస్పరం గౌరవించుకునే కార్యక్రమాల్లోనూ చేనేత శాలువాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధి ద్వారా కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు సామాజికంగా గౌరవప్రదమైన జీవనం అందించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెటింగ్‌ అవకాశాలను పెంచడం ద్వారా కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయ జీవితం వరకు కష్టపడి పనిచేసిన స్ఫూర్తితో నూతన చైర్మన్‌ చేనేత రంగ అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేయాలని పొన్నం ప్రభాకర్‌ సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించడం, తెలంగాణ చేనేతకు విస్తృత గుర్తింపు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు