నూతన సంవత్సర వేళ పరిటాల శ్రీరామ్ కు శుభాకాంక్షల వెల్లువ
విశాలాంధ్ర ధర్మవరం : 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి, సంక్షేమం చూస్తారని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. నూతన సంవత్సరం వేళ ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కనిపించింది. రామగిరి మండలం వెంకటాపురం తో పాటు ధర్మవరంలోని టిడిపి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల వరకు పరిటాల శ్రీరామ్ వెంకటాపురంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ధర్మవరంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కార్యాలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. కార్యకర్తలు, అభిమానులు శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025లో ధర్మవరం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఈ ఏడాది పార్టీ పరంగా శుభవార్తలు వింటారన్నారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఈ సంవత్సరం మా అడుగులు ఉంటాయని శ్రీరామ్ స్పష్టం చేశారు.