పీఏబీఆర్ నీటి నిల్వల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు…
జిల్లా కలెక్టర్ కు అభినందనలు
సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : ఉద్యాన పంట రైతులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పీఏబీఆర్ నీటి నిల్వల కోసం ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రతిపాదనలు పంపినందుకు సిపిఐ జిల్లా సమితి తరపున సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ అభినందనలు తెలియజేస్తూ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీఏబీఆర్ (పెన్నాహోబిలం) 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ప్రస్తుతం ఐదు టీఎంసీలకు మించి నిల్వ ఉంచడం లేదన్నారు. 9, 248.30 ఎకరాలకు గాను ఇప్పటివరకు 5,979 ఎకరాలే సేకరించారన్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉంచాలంటే పరిపాలన అనుమతులు బడ్జెట్ కేటాయింపులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ పంపారన్నారు. అదేవిధంగా అరటి చీని టమోటా రైతులకు శిక్షణ కేంద్రం, జిల్లాలో ఉద్యాన ఉత్పత్తులను పెంచే లక్ష్యంలో భాగంగా విత్తనం ఎంపిక నుంచి విక్రయం వరకు రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. అనంతపురము జిల్లా కరువు జిల్లా క్షామా పీడిత ప్రాంతం అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా కావున కరువును పారద్రోలాలంటే తుంగభద్ర డ్యామ్ నుండి 32.5 టిఎంసి నీరు అందించాలన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి పిల్ల కాలువలు తవ్వి ఉభయ జిల్లాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేశారు.