అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శలు గుప్పించారు. ట్రంప్ విధించిన టారిఫ్ ల వల్ల అమెరికా – కెనడాల మధ్య 40 ఏళ్లుగా ఉన్న బంధం నాశనమయిందని మండిపడ్డారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ పెను ముప్పుగా మారారని విమర్శించారు. ఈ నెల 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మాంట్రియల్ లో జరిగిన ఎన్నికల డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ కారణంగా నెలకొన్ని పరిస్థితులను అధిగమించాలంటే కెనడాలో అంతర్గతంగా ఉన్న వాణిజ్య హద్దులను మనం చెరిపేసుకోవాలని కార్నీ సూచించారు. దీనికి ప్రావిన్సులు, టెరిటరీల సహకారం కీలకమని చెప్పారు. అప్పుడే కెనడా ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వెంటనే ట్రంప్ తో వాణిజ్య చర్చలు నిర్వహిస్తానని చెప్పారు.
కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేస్తామంటూ ట్రంప్ కొంత కాలంగా బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. అది జరిగే పని కాదని కెనడా ప్రతిస్పందించింది. దీంతో, అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే కెనడాపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. కెనడా కూడా అమెరికాపై భారీగా టారిఫ్ లు విధించింది. ట్రంప్ తగ్గేంత వరకు తమ ప్రతీకార చర్య కూడా కొనసాగుతుందని ప్రధాని కార్నీ స్పష్టం చేశారు.