అన్ని ఏర్పాట్లను వెంటనే చేపట్టాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం : ఉగాది ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, విజయవంతంగా నిర్వహించాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఉగాది ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఉగాది ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమం కోసం జాయింట్ కలెక్టర్ ఇంచార్జిగా ఉంటారన్నారు. మినిట్ టు మినిట్, ఇన్విటేషన్ సిద్ధం చేయాలన్నారు. ఉగాది ఉత్సవాలలో వేద పండితుల ఆశీర్వాదం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, ఉగాది పచ్చడి పంపిణీ, ఎద్దులబండి ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను అధికారులు వ్యక్తిగతంగా ఆహ్వానించాలన్నారు. ప్రోటోకాల్, బందోబస్తు, సెక్యూరిటీ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వేసవి సందర్భంగా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. రెవెన్యూ భవనం డెకరేషన్ బాగా ఉండాలని, ఎంట్రెన్స్ గేట్ కూడా అలంకరించాలని, రంగోలి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి సిబ్బంది పాల్గొనాలని, వారికి స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ కు సూచించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉగాది ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలరాజు, డిఈఓ ప్రసాద్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష నాయుడు, జిల్లా పర్యటక శాఖ అధికారి జయకుమార్ బాబు, తహసీల్దార్ హరికుమార్, ఉద్యాన శాఖ టెక్నికల్ అధికారి పల్లవి, తదితరులు పాల్గొన్నారు.