సౌధీలో చిక్కుకున్న శ్రీకాకుళం వలస కార్మికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా
- బాధితులతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి
విశాలాంధ్ర – శ్రీకాకుళం: పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి, యాజమాన్యాల చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, నందిగాం, ఒడిశా లోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది వలస కార్మికులు సౌదీ వెళ్లి, చిక్కుకున్న విషయం తెలిసిందే. 2 నెలలు పని చేసినా సంబంధిత యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడం, గత 4 రోజులుగా తిండి కూడా లేకపోవడంతో వారంతా అల్లాడిపోయారు. బాధిత కుటుంబాల ద్వారా సమస్యను తెలుసుకున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్.. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన… బాధిత కార్మికులతో సోమవారం మాట్లాడారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కలిసి, ఒప్పిస్తానని ప్రకటించారు. అలాగే భారత ఎంబసీ కార్యాలయానికి సమస్యను చేరవేసి.. ఆహారం, ఇతర ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. దీంతో ఎంతో ఉపశమనం లభించిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.