ఇజ్రాయిల్ సేనలు వెనక్కు మళ్లే వరకు చర్చలుండవు: ఇరాన్
తెహ్రాన్: యుద్ధం నేపథ్యంలో అమెరికా నాన్చుడు ధోరణి వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో చర్చలు నిలుపుదల చేసినట్టు అక్కడి మీడియా సంస్థ తస్నీమ్ తాజాగా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. హోర్ముజ్‌ను మళ్లీ మూసేయడంతో పాటు ఇతర జలసంధులను కూడా టార్గెట్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఇప్పటి వరకూ యూఎస్‌తో మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపిన ఇరాన్ ఇకపై ఈ ప్రక్రియను నిలుపుదల చేయనున్నట్టు తెలిపింది. మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపించడాన్ని నిలిపివేయనునట్టు తెలిపింది. ఇజ్రాయిల్, దాని మిత్ర దేశాలను శిక్షించేందుకు ఇరాన్‌తో పాటు యెమెన్, లెబనాన్, ఇరాక్ దేశాలు ఏకమైనట్టు రాసుకొచ్చింది. హోర్ముజ్‌ను పూర్తిగా దిగ్బంధించడంతో పాటు మరో కీలక జలసంధి ‘బాబ్ ఎల్ మాండెబ’పై కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. గాజా, లెబనాన్‌లో జియోనిస్టు పాలకుల (ఇజ్రాయిల్) సైన్యం చేస్తున్న దారుణాలకు తక్షణం ఫుల్ స్టాప్ పడాలని ఇరాన్ డిమాండ్ చేస్తోందని తస్నీమ్ పేర్కొంది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పూర్తిస్థాయిలో వెనక్కు పిలిపించుకోవాలని డిమాండ్ చేస్తోందని తెలిపింది. ఇజ్రాయిల్ సేనలు వెనక్కు మళ్లే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవని ఇరాన్ తేల్చి చెప్పినట్టు ఒక కథనాన్ని ప్రచురించింది.
యూఎస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలోని రక్షణలు లెబనాన్‌కూ వర్తిస్తాయని అన్నారు. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థను టార్గెట్ చేస్తున్న ఇజ్రాయిల్‌పై మండిపడ్డారు. లెబనాన్‌పై దాడులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నిలిచిన అమెరికా-ఇరాన్ చర్చలు!
- Advertisement -


