అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి స్థానిక ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరుల ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా న్యాయస్థానం కొట్టివేసింది.ఈ విధానం ఫెడరల్ వలస చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జీనెట్ వర్గాస్ తీర్పు ఇచ్చారు.
ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ విషయంలో కాన్సులర్ అధికారుల నిర్ణయాధికారంపై విదేశాంగ కార్యదర్శికి ఉన్న అధికారాన్ని ఫెడరల్ చట్టం పరిమితం చేస్తోందని జడ్జి పేర్కొన్నారు.దరఖాస్తుదారుల జాతీయత ఆధారంగా వీసా జారీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసే అధికారం విదేశాంగ శాఖకు లేదని స్పష్టం చేశారు.
జనవరిలో 75 దేశాలపై ఆంక్షలు
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 2026 జనవరి 21 నుంచి 75 దేశాలకు చెందిన ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు వీసాల జారీని నిలిపివేశారు.అయితే వీసా దరఖాస్తులు, ఇంటర్వ్యూలను కొనసాగించేందుకు అవకాశం కల్పించారు.అమెరికా ప్రభుత్వం ఈ దేశాలకు చెందిన వలసదారులు భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉందన్న ఆందోళనను కారణంగా చూపింది.ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో.. అమెరికన్లపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.కొత్త వలసదారులు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలపై అధికంగా ఆధారపడకుండా ఉండే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది.
‘చట్ట విరుద్ధం’ అన్న న్యాయస్థానం
75 దేశాల పౌరుల జాతీయతను ఆధారంగా చేసుకుని ఇమ్మిగ్రెంట్ వీసా జారీ ప్రక్రియను నిలిపివేయడం చట్టబద్ధం కాదని జడ్జి జీనెట్ వర్గాస్ పేర్కొన్నారు.ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న విధానం “చట్టవిరుద్ధమైనది” అని ఆమె అభిప్రాయపడ్డారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన చట్టబద్ధ అధికార పరిధిని మించి వ్యవహరించారని తీర్పులో పేర్కొన్నారు.ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో దరఖాస్తుదారుల జాతీయత ఆధారంగా సమష్టిగా నిషేధం విధించడం ఫెడరల్ వలస చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా
ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసిన వీసా ప్రాసెసింగ్ జాబితాలో దక్షిణాసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు రష్యా, బ్రెజిల్, కొలంబియా, అల్బేనియా తదితర దేశాలు ఉన్నాయి.ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లోని పలు దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వలసదారుల హక్కుల సంఘాలు, ప్రభావిత వీసా దరఖాస్తుదారులు, అమెరికా పౌరులు కోర్టును ఆశ్రయించారు.వారి పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్హాటన్లోని సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు తాజాగా ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని కొట్టివేసింది.


