విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు: ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణానికి పెడుతున్న ఖర్చులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజలపై భారం వేయడం లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి
శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరు
నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి నారాయణ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, కాలువలు, పెండిరగ్‌లో వున్న బీసీ, అంబేద్కర్ భవన్‌ల నిర్మాణాలు, ప్రధాన కూడళ్లు, అండర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్‌ల వద్ద పెయింటింగ్‌లు, పారిశుద్ధ్యం, మెప్మా కార్యక్రమాలు మొదలైన అంశాలపై ఆయాశాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఆయాశాఖలకు కేటాయించిన పనులను వేగంగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ప్రజలు చెల్లిస్తున్న పన్నుల డబ్బును వినియోగించే ప్రసక్తే లేదని, రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి సేకరించిన 5వేల ఎకరాల్లో సుమారు 1200 ఎకరాలను అంతర్జాతీయ, జాతీయస్థాయి విద్యాసంస్థలు, పాఠశాలలు, పరిశ్రమలు నెలకొల్పోందేకు కేటాయించినట్లు చెప్పారు. రాజధానిలో మిగిలిన భూమిని అన్ని వసతులు కల్పించి మంచి ధరకు విక్రమించి ఆ డబ్బునే రాజధాని నిర్మాణానికి వినియోగించేలా, రాజధానికి చేసిన అప్పులు తీర్చేలా సీఎం ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రాజధాని నిర్మాణానికి 64వేల కోట్లకు పరిపాలన ఆమోదం లభించగా, 50వేల కోట్లకు అధికారులు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా రాజధానిని డిజైన్ చేశారని, హడ్కో, ఎడిబి బ్యాంకు, ప్రపంచబ్యాంకు నిధులను సమీకరిస్తూ రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్‌లో రాజధానికి 6వేల కోట్ల కేటాయించామని, ఇంకా అవసరమైతే నిధులు ఇస్తామని సీఎం చెప్పారని చెప్పారు. రాజధాని విషయంలో పారదర్శకంగా ఉంటామని, ఎలాంటి అవకతవకలు ఉండవన్న మంత్రి, ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు ప్రకారమే ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వంలాగా నిధులను మళ్లించడం లేదని చెప్పారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాల మాటలు వినవద్దని, నమ్మవద్దని ప్రజలకు సూచించారు. రాజధాని ప్రాంతంలో జడ్జిలకు నిర్మిస్తున్న భవనాలకు చదరపు అడుగుకు ఒక పత్రికలో10వేలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచురించారని, అయితే తాము రూ.4600తో నిర్మిస్తున్నామని, సిసి కెమెరాలు, ఫర్నీచర్‌కు కొంత పెరిగే అవకాశం వుంది తప్ప రూ.10వేలు ఖర్చు చేస్తున్నామని ప్రచురించడం వాస్తవం కాదన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఒక సెంటు భూమి ఇస్తే తాము రెండు సెంట్లు భూమి ఇస్తున్నామని, తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు. నెల్లూరు 54వ డివిజన్ భగత్‌సింగ్‌కాలనీలో పెన్నా బ్రిడ్జి వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి కోర్టు నుంచి చట్టపరంగా అభ్యంతరాలు లేకపోతే అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి చెప్పారు. ఏయే డివిజన్‌లలో పట్టాలు ఇవ్వాలో అందరికి పట్టాలు ఇస్తామని చెప్పారు. భగత్‌సింగ్‌కాలనీలో పట్టాలు ఇచ్చేందుకు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో స్టడీ చేసి సర్వే చేయమని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.
గత ప్రభుత్వంలో నిర్మాణంలో ఆగిపోయిన బీసీ భవన్, అంబేద్కర్ భవన్ తిరిగి పున:ప్రారంభిస్తామని, బడ్జెట్ మంజూరు కోసం ఆయాశాఖల మంత్రులతో మాట్లాడినట్లు మంత్రి వెల్లడిరచారు. నగరంలో దోమలు లేని నగరంగా చేయడానికి రామిరెడ్డికాలువ, ఉయ్యాలకాలువకు శ్లాబు వేస్తామని, వీటికోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చెప్పారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటికి 165కోట్లు నిధులు త్వరలో మంజూరు కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నగరంలోని అన్ని పాఠశాలల్లో అత్యాధునిక ఆటవస్తువులు ఏర్పాటుచేస్తున్నామని, విఆర్ స్కూల్‌ను మోడల్ స్కూల్‌గా తిరిగి ప్రారంభిస్తామని, నగరంలోని సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువ కట్టలు, మురికివాడల పిల్లలకు ఇందులో అడ్మిషన్లు కల్పించి ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించి విఆర్ హైస్కూల్‌కు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.ఈనెల 15 నుంచి స్కూల్ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఒక్క స్కూల్‌ను కూడా మూసే ప్రసక్తే లేదని, ఏవైనా గత ప్రభుత్వం మూసివేసి వుంటే వాటిని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. స్వీపింగ్ మిషన్లు, కాంపాక్టర్లు అందించి అన్ని నగరాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి మంత్రినారాయణ అహర్నిశలు శ్రమి
స్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అంబేద్కర్‌భవన్, బీసీ భవన్‌ను తిరిగి ప్రారంభించేలా ఆయాశాఖల మంత్రులతో మాట్లాడి పనులు మొదలయ్యేలా చర్యలు చేపట్టడం సంతోషకరమైన విషయమన్నారు. నగరంలో ఇరిగేషన్ పనులు, ఆర్‌అండ్‌బి రోడ్లు, పెయింటింగ్స్, శానిటేషన్ పనులను ఒక నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలిస్తూ, నగర సమగ్రాభివృద్ధికి మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఈ సమావేశంలో
నెల్లూరు ఆర్డీవో వంశీకృష్ణ, అడిషనల్ కమిషనర్ వై.ఓబులేసు నందన్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈలు దేశ్‌నాయక్, గంగాధర్, బీసీ, ఎస్‌సి వెల్ఫేర్ అధికారులు వెంకటలక్ష్మి, శోభారాణి, మెప్మా పిడి రాధ, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు…
అమరావతి నిర్మాణానికి ఒక్క పైసా కూడా ప్రజల డబ్బు వినియోగించం-మంత్రి నారాయణ
RELATED ARTICLES