గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసులో ఊరట లభించి బెయిల్ మంజూరైనా, మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు కావడంతో ఆయన గత 95 రోజులుగా జైలుకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన జైలు జీవితం మరింత కాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల సమయంలో గన్నవరంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై వంశీపై కేసు నమోదైంది. అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉండటంతో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే, కేసును మాత్రం మూసివేయలేదు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తిరిగి టీడీపీలో చేరడంతో పరిస్థితులు మారాయి. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో వంశీ పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు, తాజాగా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బాపులపాడులో హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్‌పై శుక్రవారం విచారణ జరిగి, వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి, విధ్వంసం కేసుతో పాటు, ఒక ప్రైవేటు స్థలం ఆక్రమణకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. గన్నవరం స్థల ఆక్రమణ కేసులో హైకోర్టు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేశాయి. టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసుకు సంబంధించి సీఐడీ తరఫున వాదనలు పూర్తికావడంతో, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదిలా ఉండగా, గన్నవరంలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి వంశీపై మరో కేసు చుట్టుకునేలా ఉంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జరిపిన విచారణలో అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. మైనింగ్‌తో పాటు ఇతర శాఖల ప్రమేయం కూడా ఈ అక్రమాల్లో ఉన్నట్లు గుర్తించడంతో, ఈ కేసును ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే జరిగితే వంశీపై మరో కేసు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.