గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వంశీకి… పోలీసుల కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి, ఆయన్ను కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వంశీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, వల్లభనేని వంశీకి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా, కంకిపాడు ఆసుపత్రి నుంచి మెరుగైన సౌకర్యాలున్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.