దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కి, గుంతకల్ రైల్వే డివిజన్ డి, ఆర్,ఎం ద్వారా వినతి పత్రం అందజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆదాయాన్ని కోల్పోకుండా, ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ కి గుంతకల్ రైల్వే డివిజన్ డి ఆర్ఎం ద్వారా వినతిపత్రాన్ని బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ జోన్ పరిధిని మరియు ఆదాయం అధికంగా వున్న రైల్వేలైన్లను కొంతభాగం ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్ (భువనేశ్వర్) కేంద్రంగా ఉన్నజోన్ కు కిరణ్ డోల్ రైల్వే లైను ను, మరియు సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్) జోన్కు, గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో వున్న రాయచూర్ ఔటర్ వరకు సికింద్రాబాద్ జోనులో కలపడంవల్ల కొత్తగా ఏర్పడిన విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పెద్దఎత్తున ఆదాయం కోల్పోతోందన్నారు. కిరణోల్ రైల్వే లైన్ నందు ఇనుప ఖనిజ గనులు ఉన్నాయన్నారు. ప్రతిరోజూ వందనుండి 200వరకు గూడ్స్ రైళ్లద్వారా రవాణా జరుగుతుండటంవల్ల భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్కు పెద్దఎత్తున ఆదాయం సమకూరుతుంది అని పేర్కొన్నారు. అదేవిధంగా రాయచూర్ దగ్గర వున్న ఆర్ .టి .పి .ఎస్ . విద్యుత్తు కేంద్రం ఉందన్నారు. ఇక్కడినుండి ప్రతిరోజూ 50 నుండి వంద వరకు గూడ్స్ రైళ్ల రవాణా జరుగుతోందన్నారు. ఈ ఆదాయాన్ని కూడా కోల్పోయి, సికింద్రాబాద్ రైల్వేజోన్కు కలిపేవిధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈరెండూ కోల్పోవడంవల్ల విశాఖపట్నం రైల్వే జోన్కు పూర్తిగా ఆదాయం తగ్గిపోతోందన్నారు. భవిష్యత్తులో ఆదాయం లేని రైల్వే జోన్ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి అని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు (విశాఖపట్నం) కిరణ్ డోల్ రైల్వే లైను కలపాలన్నారు . గతంలో చితాపూర్ వరకు వున్న రైల్వేలైన్ను గుంతకల్లు రైల్వే డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వీటితోపాటు పురాతనమైన గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రమైన రైల్వే స్టేషన్ నందు ఇంతవరకూ 24 బోగీలు నిలపగలిగే సామర్థ్యం కలిగిన ఫిట్ లైను లేకపోవడం సిగ్గుచేటు అన్నారు . రైల్వే కోచింగ్ డిపోలు మరియు రైల్వే ఫీట్ లైన్లు విజయవాడ డివిజన్లో 1)విజయవాడ, 2)కాకినాడ, 3) నరసాపూర్, 4)మచిలీపట్నంల లో వుండగా గుంతకల్లు డివిజన్లో కేవలం ఒక్క తిరుపతిలో మాత్రం కోచింగ్ డిపో, ఫిట్ లైన్లో ఉందన్నారు.
గుంతకల్లు స్టేషన్లో కూడా యుద్ధప్రాతిపదికన 24 బోగీలు నిలిపే ఫిట్లెన్లను ఏర్పాటుచేసి రైల్వే కోచెస్ మెయింటెనెన్స్ డిపోను గుంతకల్లు రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ మీదుగా ఈక్రింది రైళ్లను ప్రయాణీకుల సౌకర్యార్థం నడిపించాలని కోరుతున్నామన్నారు. కరోనా సమయంలో రద్దుచేసిన గుంతకల్లు-బళ్లారి ప్యాసింజర్ రైలును పునరుద్దించాలన్నారు.
పగటిపూట ప్రయాణించే హుబ్లి-విజయవాడ మరియు యశ్వంతపూర్-విజయవాడ రైళ్లను క్యాన్సిల్ చేశారన్నారు . ట్రెయిన్ నెం.56501, 56502, 56503, 56504 వీటిని మరలా కొనసాగించాలన్నారు. యశ్వంతపూర్-టాటానగర్ ఎక్స్ ప్రెస్ రైలు గుంతకల్ రైల్వే స్టేషన్ కు పోకుండా దీనిని బైపాస్ లైను మీదుగా పంపుతున్నారు. ఈ రైలు గుంతకల్లు స్టేషన్కు వచ్చిపోయే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దేవేంద్ర, గుంతకల్ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్, గుంతకల్ రూరల్ మండల కార్యదర్శి రాము రాయల్, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.