విశాలాంధ్ర జిల్లా ప్రతినిధి – పుట్టపర్తి: పుట్టపర్తి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమె నాయకత్వంలో 11వ వార్డు కర్ణాటక నాగేపల్లిలో కూటమి పార్టీల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేకల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేకల ఈశ్వర్ మాట్లాడుతూ, పుట్టపర్తి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రశాంతమైన పుట్టపర్తి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి సమస్యను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక నిధులు సమకూర్చుకుని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
పుట్టపర్తిని అభివృద్ధికి నమూనాగా నిలుపుతాం
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పుట్టపర్తి మున్సిపాలిటీని దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పుట్టపర్తిలో భారీ పెట్టుబడులతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేకల ఈశ్వర్‌తో పాటు మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.


