Saturday, May 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర చేయి కూడా ఆయుధం అవుతుంది

యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర చేయి కూడా ఆయుధం అవుతుంది

ధర్మవరం మినీ మహానాడులో పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు

గజమాలతో పరిటాల శ్రీరామ్ కు ఘన సత్కారం
విశాలాంధ్ర ధర్మవరం: యుద్ధం తప్పదన్నప్పుడు అర చేయి కూడా ఆయుధంగా మారుతుందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో నియోజకవర్గ మినీ మహానాడు అట్టహాసంగా సాగింది. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు అంజినప్ప, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ నగర్
లోని మారుతీ రాఘవేంద్ర స్వామి కళ్యాణమండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు పరిటాల శ్రీరామ్ కి గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్, పరిటాల రవి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన పెహల్గామ్ మృతులకు, యుద్ధంలో అమరులైన సైనికులకు కూడా నివాళులర్పించారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ పచ్చ కండువా అంటే వ్యసనం అని.. దానిని ఒక్కసారి పట్టుకుంటే వదలలేని విధంగా బంధం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం గురించి చెప్పాలంటే 1983కు ముందు తర్వాత అని చెప్పాలన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాతనే దేశంలో తెలుగోడి సత్తా తెలిసిందని.. చరిత్రలో మన పార్టీకి ఒక పేజీ వచ్చిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో మెట్లు ఎక్కించి అభివృద్ధి బాటలో నడిపారని తెలిపారు. ప్రస్తుతం నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలంగా మారిందన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ రాక్షస పాలనలో పార్టీ నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజల పక్షాన పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. మనం ధర్మవరం ఎమ్మెల్యే అవ్వాలని పోరాడలేదని.. వైసీపీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే పని చేశామన్నారు. అయితే గత 11నెలలుగా జరుగుతున్న సంఘటనలను చూసిఎటువంటి భయాందోళనకు గురి కావద్దని, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసిన వాటికంటే ఇవి గొప్పవి, పెద్దవి కాదన్నారు. ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని.. అందరికీ మంచి జరిగే రోజు వస్తుందని భరోసా ఇచ్చారు. అయితే కొందరు అడుగులకు మడుగులు ఒత్తుతూ.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అన్నట్టు వ్యవహరిస్తుంటారని.. అలాంటి వారిని మర్చిపోమన్నారు. ప్రతి ఒక్కరూ ఓపిగ్గా ఉండాలన్నారు. ధర్మవరం నాకు ఎంతో ఓపిక నిచ్చిందని.. కానీ నాలో ఉన్న ఒరిజనల్ మాత్రం అలానే ఉందన్నారు. అవసరమైతే అరచేయి కూడా ఆయుధంలా ఉంది.. యుద్ధం తప్పదన్నప్పుడు ఆ ఆయుధం కూడా వాడాల్సి ఉంటుందన్నారు. అప్పుడు డబుల్ గేమ్ ఆడేవాళ్ల దగ్గరి నుంచే మొదలు పెడతానన్నారు. గ్రామాల్లో నాయకుడు మాట చెల్లుబాటు కాలేదంటే అది మరణంతో సమానమని.. మీరు గ్రామాల్లో స్వేచ్ఛగా కార్యాలయాలకు వెళ్లి ప్రజల కోసం పని చేయించుకోవాలన్నారు. పరిటాల రవి స్ఫూర్తిగా మనం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నా కోసం పని చేసిన వారినెవర్నీ మర్చిపోలేదని.. నా గుణం అలాంటిది కాదన్నారు. మీరు తప్పు చేసినా.. ఒప్పు చేసినా.. మీ వెంట ఉండాల్సింది నేనేనని శ్రీరామ్ వ్యాఖ్యానించారు. ఎవరో మాట్లాడే మాటలకు ఢీలా పడవద్దని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధి విషయంలో సలహాలు ఇస్తే తీసుకుంటాం కానీ.. ఇష్టమొచ్చినట్టు గతంలో లాగా చేస్తామంటే ఊరుకునేది లేదని శ్రీరామ్ హెచ్చరించారు. ఇటీవల పద్మభూషన్ అవార్డు దక్కించుకున్న ఎమ్మెల్యే బాలక్రిష్ణకు నియోజకవర్గం తరుఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు శ్రీరామ్ తెలిపారు. శనివారం జరిగే మినీ మహానాడు, కడపలో జరిగే మహానాడుకు పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. మరోవైపు పార్లమెంట్ అధ్యక్షుడు అంజినప్ప మాట్లాడుతూ ధర్మవరంలో కూటమి గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు చేసిన కష్టాన్ని ఎవరూ మరువలేరన్నారు. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, పరిటాల శ్రీరామ్ అండగా ఉంటారన్నారు. ఆరోజు పరిటాల శ్రీరామ్ వైసీపీని ధైర్యంగా ఎదుర్కొని కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారన్నారు. శ్రీరామ్ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ మరింత బలంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమతం కాటమయ్య, పని కుమార్, సంద రాఘవ, విజయ చౌదరి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ, జింకా పురుషోత్తం, పురుషోత్తం గౌడ్, చిగిచెర్ల ఓబిరెడ్డి, మద్దిలేటి, బీమా నేని ప్రసాద్ నాయుడు, జింక రాజన్న, వేణుగోపాల్ రెడ్డి, మాధవ రెడ్డి, తుమ్మల సూరి, మనోహర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు