మెక్సికో: పట్టణీకరణతో జనాభా పెరుగుదల, ఇతరత్రా సమస్యలే కాదు…భౌగోళిక సమస్యలూ తలెత్తుతున్నాయి. పర్యావరణాన్ని లెక్క చేయకుండా విస్తరిస్తోన్న నగరాలు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతున్నాయి. సరైన ప్రణాళిక లేని నగర విస్తరణ వల్ల కలిగే విపరిణామాలకు ‘మెక్సికో’ నగరం నిదర్శనగా నిలిచింది. మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీ అసాధారణ స్థాయిలో కుంగుతోంది. రోదసి నుంచి కూడా ఈ పరిణామ తీవ్రత కనిపించింది. భూకక్ష్యలో పరిభ్రమిస్తోన్న భారత్, అమెరికా సంయుక్త ఉపగ్రహం ‘నైసార’ దీన్ని పసిగట్టింది. ఈ నగరం ఏటా 10 అంగుళాల మేర కుంగుతోందని అది పంపిన చిత్రం స్పష్టంచేస్తోంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా కుంగిపోతున్న మహానగరాల్లో ఒకటిగా మెక్సికో సిటీ నిలిచింది. ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో మెక్సికో సిటీ కూడా ఒకటి. దీని విస్తీర్ణం 7,800 చదరపు కిలోమీటర్లు కాగా…2.2 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. ఈ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక పురాతన సరస్సు గర్భంపై నిర్మించారు. ఇక్కడి ముఖ్యమైన వీధులు ఒకప్పటి కాలువలు. ఈ ప్రాంతంలో నగర విస్తరణ, భూగర్భజలాలను విపరీతంగా తోడేయడం వల్ల నేలలోని జలాశయ గర్భం కిందికి పోతోంది. దీంతో శతాబ్ద కాలంగా నగరం కుంగుతోంది. ఫలితంగా పురాతన భవనాలు ఒకపక్కకు ఒరిగిపోయినట్లు కనిపిస్తున్నాయి. కుంగుదల వల్ల మెక్సికో సిటీలోని సబ్‌వేలు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఇళ్లు, వీధులు దెబ్బతింటున్నాయి. శతాబ్ద కాలంలో 39 అడుగుల మేర నగరం కుంగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిణామాన్ని ప్రపంచ మానవాళి గుర్తెరగాలి.


