Monday, February 24, 2025
Homeసాహిత్యంఅంపశయ్యపై అమ్మభాష

అంపశయ్యపై అమ్మభాష

అరుణ

భాష మానవ సంస్కృతి, నాగరికతలకు ప్రతిరూపం. భాష మానవులకు గల ప్రత్యేక లక్షణం. ఇది భావ వాహిక. దీనిని మనం ఆలోచించటానికి, సమస్యలు పరిష్కరించటానికి, ఆడుకోవడానికి, కలలు కనడానికి, వ్యాఖ్యానించటానికి, ఉద్వేగాల వ్యక్తీకరణకు, సమాచారం పంచుకోవటానికి ఉపయోగించుకొంటాం. పిల్లలందరూ నాలుగేళ్ల వయసు నాటికే భాష విషయక పరిణతి పొంది ఉంటారు.
భాషసమాజం: పిల్లలు సహజంగా భాషా సామర్థ్యాలతో జనించినప్పటికీ, ఆయా భాషలకు వాటి సామాజిక నేపథ్యంలోనే సంపాదిస్తారు. సమాజం లేకుండా భాష లేదు. సమాజం మారితే భాష కూడా మారుతుంది. ఆంధ్రదేశం అపారమైన సహజ, మానవ వనరులు కలిగిన ప్రాంతం. దాదాపు మూడువేల సంవత్సరాల లిపి, భాష, శాసనాలు, చారిత్రక, సాంస్కృతిక వికాసం, దేశ భాషలందు తెలుగు లెస్సగా, ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌గా, పాలలా కమ్మగా, తేనెలా తీయగా, తీపి తీపి తెలుగు, తేట తేట తెలుగు, చక్కెర మాటల మూట, చక్కని తేనెల ఊట, మంచి ముత్యాల పేట, మధురామృతాల తోట తెలుగు, కాకతీయుల పౌరుషాగ్ని తెలుగు. కూచిపూడి నృత్యంలోని అందం తెలుగు. ఎంత చెప్పుకొన్నా తనివి తీరనిది తెలుగు. ఇంతటి గొప్ప భాష సంస్కృతి, సాహిత్యం మొత్తంగా తెలుగు సంస్కృతి నేడు మరణ శయ్యపై ఉందంటే బాధగా ఉంది. ఈ పరిస్థితి దాపురించటానికి గల కారణాలు చారిత్రక దృక్పధంతో చూడాల్సి ఉంటుంది. చారిత్రక దృక్పథం: పూర్వం ఆనాడు గురుకులాశ్రమాలు విలువైన విద్యను అందించాయి. నలందా, తక్షశిలా లాంటి విశ్వవిద్యాలయాలు ఆ సమాజానికి అవసరమైన మంచి విద్యను అందించాయి. విదేశీ యాత్రికుడు (హ్యూయాన్‌త్సాంగ్‌) కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి విజ్ఞానాన్ని సంపాదించుకొన్నాడు. ఎంతోమంది విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. ఆనాటి రాచరిక వ్యవస్థ అన్ని సౌకర్యాలు సమకూర్చింది. మహమ్మదీయుల పాలనలో కూడ కొద్ది మార్పులతో ఇదే విధానం కొనసాగింది. విద్య ఇంత ఉన్నతస్థానంలో ఉండటానికి కారణం మన దేశంలో విద్యను మాతృభాషలో బోధించటమే. బ్రిటీషు వారి రాకతో సామ్రాజ్యవాద అడుగుపడిరది. ఇది వలసపాలన. పాతవ్యవస్థను నాశనం చేసింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి, విద్యను విలువలేని సరుకుగా మార్చటానికి, వారికి అవసరమైన గుమస్తాలు తయారుచేయటానికి, నూతన విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టటానికి మెకాలేను నియమించటం జరిగింది. మెకాలే ఇక్కడి విద్యా వ్యవస్థను, అందులోని నైతికత విలువలు చూసి ఆశ్చర్యపోయి, ఇక్కడి విద్యా వ్యవస్థను సంస్కృతిని, భాషను ధ్వంసం చేయకుండా ఏమి సాధించలేననే విషయాన్ని గ్రహించాడు. మెల్లగా ధన సంపాదనే మార్గంగా, ఏ నైతిక విలువలకు స్థానం లేకుండా, భారతీయ సంస్కృతి, నాగరికతలను ఫణంగా పెట్టి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు. ఇందుకు సాక్ష్యం మెకాలే. ఫిబ్రవరి2 1835 న బ్రిటీషు పార్లమెంటుకు రాసి పంపిన లేఖలోని సారాంశం ఇది.
‘‘భారతదేశంలో తూర్పుపడమరలు ప్రయాణించాను. నాకు ఎక్కడ ఒక దొంగ గాని, ఒక భిక్షువు గాని కనిపించలేదు. అపారమైన సంపద కలిగి ఉన్న భారతదేశం, వీరికున్న నైతిక విలువలే వారికున్న ప్రబలమైన శక్తి, దీన్ని బట్టి నేను ఏమనుకొంటున్నాను అంటే ఈ దేశాన్ని మనము ఎన్నడూ జయించలేము. ఈ దేశానికి వెన్నెముకలా నిలిచినటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపదను, ప్రాచీన విద్యావిధానాన్ని మరిపించే దానిస్థానంలో ఇంగ్లీషు ఎంత ఉన్నతమైనదని, భారతీయులు ఆలోచించేలా వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా, వారి సహజ సంస్కృతుల స్థానంలో మనమనుకొన్న వాటిని ప్రవేశ పెట్టినపుడు మాత్రమే మనము ఈ దేశాన్ని పూర్తిగా జయించగలము.’’ అని పైవిధంగా 1835 సం॥లో సాక్షాత్తు లార్డ్‌ మెకాలే బ్రిటీషు పార్లమెంటుకు పంపిన లేఖలోని సారాంశము. అమ్మ భాష ప్రాధాన్యత: స్వాతంత్య్రానంతరం ఇప్పటికి మెకాలే విద్యా విధానమే అమల్లో ఉంది. ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీషు భాష సునామీలా మన దేశంపై విరుచుకుపడ్డాయి. 1991 నూతన ఆర్థిక విధానాలు దీనికి పూర్తిగా ఊతం ఇచ్చాయి. దీనికి కారణం సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ. ఇవ్వాళ మంచి ఇంగ్లీషు ఎవ్వరికీ రాదంటే ఆశ్చర్యపడనవసరము లేదు. 1947కి ముందు మనం నేరుగా ఇంగ్లీషు వారి నుంచి నేర్చుకొనేవారం. కాని ఇవ్వాళ ఇంగ్లీషు రాని వారి నుంచి ఇంగ్లీషు నేర్చుకొంటున్నాం. మాతృభాషలో విద్యాబోధన పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించి, వికాసానికి తోడ్పడుతుంది. మాతృభాషలో ప్రావీణ్యం లేకుండా, మాతృ భాషే రాకుండా ఏ విద్యార్థి అయినా సర్వముఖ వికాసం చెందటం కాని పని. మాతృభాషలకు దూరమై చదివే తరాలలోంచి తాత్వికులు, రచయితలు, మంచి నాయకులు వచ్చే అవకాశం లేదు. అభివృద్ధి చెందాయని చెప్పే దేశాలు తమ మాతృభాషలను వదులుకొని ఇంగ్లీషును కౌగిలించుకొన్నది కాదు. మాతృభాషా సంస్కృతులను వదులుకొన్న ఏ జాతికి మోక్షం లేదు. మాతృభాష రాకుండా ఎంత విద్యావంతుడైనా సరే నిరక్షరాస్యుడే. ఇతర భాషలు బాగా రావాలంటే మాతృభాష బాగా రావటం శాస్త్రీయం. ఇంకా అమ్మభాష ప్రాధాన్యత చెప్పుకోవాలంటే, మానవ సమాజ వికాసంలో మాతృభాష యెడల శాస్త్రీయ వైఖరి, అవగాహన లేకపోయినట్లయితే మనం సుడిగుండంలో పడిపోతాం. కాబట్టి కార్పొరేట్‌ ఆంగ్ల మాధ్యమాన్ని అర్థం చేసుకొని, హేతుబద్ధమైన చారిత్రక పునాదిపై నిలబడి ఆలోచించాలి. లేకుంటే మంచి వ్యక్తిత్వం గల నాణ్యమైన భావితరం మనకు అందదు. ఇది భవిష్యత్‌ తరాలకు తీరనినష్టం మిగిలిస్తుంది. తల్లిపాల సహజత్వం కమ్మదనం మాతృభాషలో ఉంది. ఈ కమ్మదనం వదలటమంటే తల్లిపాలను వదులుకోవటమే. ప్రకృతిలో తల్లిపాలు దక్కని ఏ జీవి పరిపూర్ణంగా ఎదిగి బతికి బట్ట కట్టలేదు. కాబట్టి ప్రకృతి సహజ సూత్రాలకు విరుద్ధంగా నడవటమంటే నేల విడిచి సాము చేయటమే. నేటి ఆంగ్ల మాధ్యమం బిడ్డలు తల్లిపాలు దక్కని విగత జీవులు. ఈ విగత జీవులు భావి భారత నిర్మాతలు ఎలా అవుతారు. కాబట్టి ఇంటి భాషకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలి. పిల్లల్లో విషయ పరిజ్ఞానానికి ఇంటి భాష కీలకమైంది. పిల్లల్లో పుట్టుకతోనే సహజమైన మాతృభాష అభ్యాసన కలిగి ఉంటారు. వాస్తవం ఇది కాగా విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుగుభాష పట్ల మొగ్గు చూపకపోవడానికి కారణాలేమిటో మనం పరిశీలించాలి. విదేశీ సామ్రాజ్యవాద సంస్థలకు చౌకగా కూలీలను సమకూర్చే ఇన్ఫోసిస్‌, సత్యం, విప్రో లాంటి సంస్థల జోరు ఎక్కువయింది. ఈ సంస్థలు చేస్తున్న ఊడిగం అమెరికా, యూరప్‌ దేశాల సంస్థలకు కాబట్టి ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్న వారికే ఉద్యోగాలున్నాయి. తద్వారా జ్ఞాన సముపార్జన కన్నా, కంప్యూటర్‌ విద్యా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం ఏర్పడిరది. భారతీయ యువత ఆంగ్ల బాబులుగా, డాలర్‌బాబులుగా మారి విదేశీ దేశాలకు ఊడిగం చేయటానికి తహతహలాడుతున్నారు. తద్వారా పరోక్షంగా మాతృదేశానికి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు యూరప్‌, అమెరికా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా సాఫ్ట్‌వేర్‌ రంగం కుప్పకూలటంతో డాలర్స్‌ డ్రీమ్స్‌ చెదిరిపోయి తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురై ఆత్మహత్యలకు పాల్పడి జీవితాన్ని ముగిస్తున్నారు. తెలుగు భాష పరిరక్షణ ప్రభుత్వ పాత్ర: ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో వావిలాల గోపాలకృష్ణయ్య అప్పటి శాసనసభలో ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యకలాపాలు తెలుగు భాషలో నడపాలని పట్టుపట్టారు. అప్పటి స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు. ‘‘వీలైనంత త్వరలో ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ తెలుగు భాషలో నడుపుతామని అన్నారు. కాని నేటికీ ఇది అమల్లోకి రాలేదు. తెలుగు భాషను అణచివేస్తూ తెలుగు సంస్కృతిని మరణశయ్యపై ఉంచి, తెలుగు భాషను సంరక్షించుకొందాం! అని తెలుగు మహాసభలు నిర్వహిస్తే సరిపోతుందా? ప్రభుత్వాలు ఈ ద్వంద వైఖరిని వ్యతిరేకించాలి. తెలుగుభాష అభిమానులు, తెలుగు భాష సంఘ ప్రతినిధులు ఎ.బి.కె.ప్రసాద్‌, మండలి బుద్ధప్రసాద్‌ లాంటి వాళ్లు ఈ మధ్య కాలంలో చేస్తున్న కృషి కొంతవరకు ఊరట.
ప్రజలుతెలుగు భాష అభిమానుల కర్తవ్యం: భాషా అభిమానులు ప్రజలు తల్లిభాషను అధికారభాషగా, తన దేశ భాషను జాతీయ భాషగా ఉండాలని కోరుకోవాలి. ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఉన్న అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అమల్లోఉన్న విషయం గమనించాలి. మొత్తం విద్యావ్యవస్థ వారి వారి మాతృభాషలలో జరగాలి. ఇందుకు మొత్తం సమస్త జ్ఞాన సంపదను దేశీయ, ప్రాంతీయ భాషలలో తర్జుమా కావాలి. ప్రాంతీయ భాషలలో చదువుకొన్న వారికి మెండుగా ఉపాధి అవకాశాలు లభించే వ్యవస్థ నిర్మాణం జరగాలి. తక్షణ కర్తవ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అసలు ప్రభుత్వ, ప్రైవేటు అనే రెండు రకాల విద్యా వ్యవస్థలు, మీడియంలు లేకుండా ప్రజలందరికి, పేద, ధనిక తేడాలు లేకుండా అందరికీ ఒకే రకమైన విద్యా వ్యవస్థను డా॥డి.యస్‌. కొఠారి చెప్పిన (కొఠారి కమిషన్‌ 1964 1966 సిఫార్సులు) ‘‘కామన్‌ స్కూల్‌’’ విధానంలో నైబర్‌హుడ్‌ పాఠశాలల్లో దేశ ప్రధాని మొదలు ముఖ్యమంత్రి, టీచర్లు, రిక్షాపుల్లర్‌ వరకు తమ పిల్లలందరినీ ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివించగలిగితే నెహ్రూజీ కలలు కన్నా నిజమైన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడ్తుంది. అంతేకాక మొత్తం దేశీయ భాషల మనుగడకై ఎసరు పెట్టే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలైన ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి. దీనికి అన్ని వర్గాల ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పి కదిలించి, సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్ప భిన్న సంస్కృతులు, భాషలు, మనుగడలో ఉండవు. ఇది ఒక దీర్ఘకాలిక లక్ష్యం. ఏ భాష ఇతర భాషల కన్నా గొప్పది కాదు. ప్రతీ భాషకు అది ఎంత తక్కువ మంది జనాభా మాట్లాడేది అయినా, దాని విశిష్టత, ప్రాముఖ్యత దానికి ఉంటాయి. విభిన్న జాతుల మేలు కలయిక మన దేశం ప్రతి జాతి స్వతంత్రంగా ఎదిగే అవకాశం కల్పించినపుడే ఆ జాతి, ఆ భాష వెల్లివిరుస్తాయి. దానికై ఆంగ్ల భాషా గుత్తాధిపత్యాన్ని మనం తొలగించాల్సి ఉంటుంది. ఇదే తెలుగు భాషాభిమానుల, ప్రజల తక్షణ కర్తవ్యం కావాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు