. ఇండియా ఐక్య సంఘటన డిమాండ్
. పార్లమెంటు వెలుపల ఎంపీల ఆందోళన
న్యూదిల్లీ : అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ఉభయసభల్లో చర్చించాలని, దీనిపై జేపీసీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా ఐక్యసంఘటన నేతలు, ఎంపీలు ఆందోళన చేపట్టారు. అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై సభ లోపల ఆందోళన చేస్తే వాయిదా వేస్తున్నందున సభ వెలుపల ఆందోళనకు దిగామని ‘ఇండియా’ నేతలు వెల్లడిరచారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణకు చేరుకున్న ఇండియా ఐక్యసంఘటన పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన తెలిపారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్జేడీ నేత మీసా భారతి, శివసేన (యూబీటీ) నేత అరవింద్ సావంత్ సహా అనేకమంది ఎంపీలు పార్లమెంట్ ముందు ఆందోళన చేశారు. మోదీ, అదానీ ఇద్దరూ ఒక్కటే (‘మోదీ-అదానీ ఆర్ వన్!) అని రాసిన బ్యానర్ పట్టుకుని నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలంటూ నినదించారు. ఇక సమావేశాలు ప్రారంభమయ్యాక సభలోనూ వారు ఆందోళన కొనసాగించారు. అదానీ వ్యవహారంపై ఆరు రోజులుగా ఉభయసభలు దద్దరిల్లుతున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని ప్రతిపక్షపార్టీ ఎంపీలు చర్చకు పట్టుబడుతున్నా… కేంద్ర ప్రభుత్వం మాత్రం మొగ్గుచూపడం లేదు. కాగా రాహుల్‌గాంధీ పార్లమెంటు వద్ద నిరసన తెలిపిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి… ‘అదానీ కోట్ల రూపాయల నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారు? మోదీజీ’ అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వ పాలనకు అదానీ వ్యవహారం ఓ స్పష్టమైన సంకేతం. వారి విధానాలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఏది ఏమైనా అదానీ అభియోగాలపై ప్రభుత్వం స్పందించాలని ఈరోజు పార్లమెంటు సమావేశాలకు వెళ్లబోయే ముందే మేము నిరసన చేశాం’ అని అన్నారు.
ఇక ‘అదానీ కుంభకోణం, మణిపూర్, సంభల్ వంటి ఘటనలపై సభలో చర్చ జరగాలని పట్టుబట్టాం. దానికోసం 267 నోటీసులు ఇచ్చాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మా ప్రయత్నాలు మేం చేశాం. కానీ సభ జరగడం లేదు. అందుకే ప్రజానుకూల సమస్యలను లేవనెత్తడానికి మేము నిరసన చేశాం’ అని సీపీఐ ఎంపీ పి.సంతోష్‌కుమార్ మీడియాకు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగుతూ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. అయితే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్‌సభలో, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి. రాజ్యాంగంపై లోక్‌సభలో ఈ నెల 13, 14 తేదీల్లోనూ, రాజ్యసభలో ఈ నెల 16, 17 తేదీల్లోనూ చర్చించేందుకు అంగీకారం కుదిరింది. పార్లమెంటు కార్యకలాపాలు మంగళవారం నుంచి సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి.