ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జాతుల మధ్య హింసకు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ప్రేరేపించారంటూ లీకైన ఆడియో క్లిప్‌పై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్ ల్యాబ్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక సంచలనం రేపుతోంది. మొయితీలను తుపాకులు దోచుకోనివ్వండి అంటూ ఆదేశాలిస్తూ ఆడియోలో ఉన్న గొంతుక మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌దేనని ట్రూత్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో మొయితీలు, కుకీల మధ్య హింసాకాండ ప్రారంభమై 21 నెలలు అయింది. అధికారిక అంచనాల ప్రకారమే ఇంతవరకు దాదాపు 300మంది మరణించారు. పరిపాలనలో విఫలమైన ఆయనను మార్చడానికి మోదీ-అమిత్ షా ద్వయం ససేమిరా అంటోంది. మహిళల మీద అత్యాచారం చేసి వారిని నగ్నంగా ఊరేగించడం వంటి హేయమైన చర్యలు చోటుచేసుకుంటున్నా సీఎం బీరేన్ సింగ్ పరిస్థితిని అదుపు చేయలేకపోయారనడం కన్నా దగ్గరుండి ప్రోత్సహించారనడానికి ఇటువంటి ఆడియో క్లిప్పింగ్‌లు ప్రత్యక్ష ఆధారాలు. హింసను ప్రేరేపించేలా ఆయన మాట్లాడారన్న విమర్శలు ఉన్నాయి. ఈ హింసాకాండలో ఆయన పాత్రకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. ఆడియోలో ఉన్న గొంతుక సీఎందేనన్న ట్రూత్‌ల్యాబ్ నివేదికతో బీరేన్ సింగ్ గొంతుకలో పచ్చివెలక్కాయపడినట్లైంది. ఇప్పుడు సీఎం ఏంచెపుతారో వేచిచూడాలి. మణిపూర్ హింసకు సంబంధించి ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మొయితీలకు అవకాశమివ్వండి’’ అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది. ఈ క్లిప్‌లోని ఆడియోతో బీరేన్ సింగ్ గొంతు 93% వరకు సరిపోలుతోందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అయిన ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆడియోలో గొంతుక, సీఎం గొంతుక ఒక్కటే అనేందుకు ఎక్కువ అవకాశం ఉందని తెలిపిన ఆ నివేదికను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. జ్యుడిషియల్ కమిషన్‌కు సమర్పించిన క్లిప్‌లలో బీరెన్‌సింగ్‌కు చెందినదిగా చెపుతున్న గొంతు ప్రామాణికతను ధృవీకరించటంపై ఈ ప్రైవేటు ల్యాబ్ పరిశీలించింది. సీఎం అధికారిక ప్రాంతాల నుంచే ఈ ఆడియో రికార్డు చేసినట్టు ఆడియోను బయటపెట్టిన వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఆడియోకు సంబంధించి ఒక కాపీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది మే 3న మణిపూర్ హింసాకాండపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ అజరు లంబాకు కూడా అందజేశారు. ఆడియో టేప్ విషయంలో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ (కేఓహెచ్‌యూఆర్) సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. గత ఏడాది నవంబరు 8న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆడియో టేప్‌లోని గొంతు ప్రామాణికతను పరిశీలించి, కోర్టుకు నివేదిక సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ తరఫున న్యాయవాది అయిన ప్రశాంత్ భూషన్ ట్రూత్ ల్యాబ్ సేవలను కోరారు. ఈ ఆడియో టేప్‌ను పరిశీలించి ల్యాబ్ ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక ప్రతిని జత చేస్తూ ప్రశాంత్ భూషణ్‌్ గతనెల 22న సుప్రీంకోర్టులో సప్లిమెంటరీ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఈ కేసు విచారణ చేపట్టింది. కేంద్రం, మణిపూర్ సర్కారు తరఫున వాదనలను వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎప్పటిలాగానే ఈ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆడియోటేప్‌ను ప్రభుత్వానికి చెందిన కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(సీఎఫ్‌ఎస్‌ఎల్) పరిశీలన జరగాలని, మూడు వారాల గడువు కావాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. సమగ్ర నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ని ధర్మాసనం ఆదేశించింది.
మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో నివసించే మెజారిటీ ప్రజలు, చుట్టుపక్కల కొండల నుంచి కుకి`జో గిరిజన సమాజానికి మధ్య 2023 మే3న జాతి హింస చెలరేగింది. ఈ హింసలో గత ఏడాది మే 3వ తేదీ నాటికి ప్రభుత్వ గణాంకాల ప్రకారం 221 మంది మరణించారు. దాదాపు 60వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ సంఖ్య ఇప్పటికి భారీగానే పెరిగింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అసమర్థత, బాధ్యతను పూర్తిగా విస్మరించిన ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉదాసీనతవల్లే మణిపూర్ గత 21 నెలలుగా అగ్నిగుండంగా మారిందనడంలో ఎటువంటి అనుమానంలేదు. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి మోదీ సర్కారు ఇంతవరకు చేసింది శూన్యం. ఇదంతా ఏదో పరాయి దేశంలోనో, మనకు సంబంధం లేని వ్యవహారంగానో మాత్రమే మోదీ సర్కారు భావించడం అత్యంత విచారకరం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కంటితుడుపు చర్యగా ఒక్క సారి మణిపూర్ వెళ్లివచ్చారు. కానీ ఘర్షణ పడ్తున్న మొయితీ, కుకీల ప్రతినిధులతోగానీ, హింసతో అల్లాడుతున్న సామాన్య ప్రజలతోగానీ ఆయన మాటకూడా మాట్లాడలేదు. బాధితులను కనీసం పరామర్శించిన దాఖలాలు కూడాలేవు. అతిథి గృహంలో కూర్చుని కొంతమంది ఉన్నతాధికారులను పిలిపించి పరిస్థితిని సమీక్షించా ననిపించుకుని దిల్లీ వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ ప్రపంచ దేశాలూ తిరుగుతున్నారు కానీ సంవత్సరం తొమ్మిది మాసాలుగా హింసతో అట్టుడుకుతున్నా రాష్ట్రాన్ని సందర్శించాలన్న ఆలోచనే మోదీకి రాలేదు సరికదా హింసపై కనీసం నోరు మెదపలేకపోతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్న మోదీ సొంత దేశం మణిపూర్‌లో రగులుతున్న కాష్టాన్ని ఆర్పివేయడానికి చర్యలు తీసుకునేందుకు ఎందుకో సాహసించలేకపోతున్నారు. మణిపూర్ మండి పోతుంటే ఇంత ఘోరంగా నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం మోదీకి, అమిత్ షాకే చెల్లింది. హింస చెలరేగిన వెంటనే పరిస్థితిని కట్టడి చేయాలని అమిత్ షాకే కాక రాష్ట్రపతికి కూడా గవర్నర్ మొరపెట్టుకున్నారు. రాష్ట్ర గవర్నరుగా అనసూయ ఉన్నప్పుడు ఆమె దిల్లీ వెళ్లి అక్కడి పరిస్థితిని అమిత్ షాకు వివరించారు. రాష్ట్రపతిని కలుసుకుని పరిస్థితిని వివరిస్తూ కంటతడి కూడా పెట్టుకున్నారు. అయినా ఎన్డీయే ప్రభుత్వ నేతల మనసు కరగలేదు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఏ రాష్ట్రమైనా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, శాంతి భద్రతలు సుస్థిరంగా ఉంటాయని ఊదరగొడ్తున్న మోదీ ప్రభుత్వం మణిపూర్‌ను ఎందుకు పట్టించుకోవడంలేదో వారికే తెలియాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడానికీ, రాజకీయ పరిష్కారం కనుగొనడానికి మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇక్కడ నెలకొన్న విధ్వంసం గతంలో కనీ, వీని ఎరగనిదని, ఈ చిచ్చును చల్లార్చడానికి రాజకీయ, పరిపాలనా పరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌చేస్తున్నా మోదీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తొలగించాలని ఎంతోమంది చెప్తున్నా కాషాయపార్టీ నిమ్మకునీరెత్తినట్టు ఉండడం అత్యంత విచారకరం. హింసను రెచ్చగొట్టారన్న ఆడియోలలో గొంతుక బీరేన్ సింగ్‌దేనని నివేదికలు వచ్చిన నేపథ్యంలోనైనా మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది.